నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అదుర్స్ & డైరెక్టర్ డీటైల్స్

నంద‌మూరి వంశంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత ఆయ‌న వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన నంద‌మూరి బాల‌కృష్ణ త‌న తాజా చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో త‌న కేరీర్‌లో 100 సినిమాలు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్నాడు. బాల‌య్య కేరీర్‌లో వందో సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సూప‌ర్ స‌క్సెస్ దిశ‌గా దూసుకుపోతోంది.

శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా మంచి విజ‌యం సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.41 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా డైరెక్ట‌ర్ క్రిష్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న బాల‌య్య ఈ యేడాది తాను న‌టించే మ‌రో సినిమాతో పాటు త‌న కుమారుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ విష‌యంలో కూడా ఓ క్లారిటీకి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. త‌న‌కు శాత‌క‌ర్ణి లాంటి చారిత్ర‌క హిట్ ఇచ్చిన క్రిష్ డైరెక్ష‌న్‌లో మోక్షును వెండితెర‌కు ప‌రిచ‌యం చేయాల‌న్న ఆలోచ‌న‌లో బాల‌య్య ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కూడా చారిత్ర‌క క‌థాంశంతోనే తెర‌కెక్క‌నుంద‌ట‌. గౌతమిపుత్ర శాతకర్ణికి సీక్వల్ గా శాతకర్ణి కుమారుడు వాశిష్టిపుత్ర పులుమావి కథతో రూపొందే సినిమాతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వారాహి చల‌న‌చిత్రం ప‌తాకంపై సాయి కొర్ర‌పాటి ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం క్రిష్ విక్ట‌రీ వెంకటేష్ హీరోగా ఓ థ్రిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఆ సినిమా త‌ర్వాత మోక్షు సినిమా కోసం క్రిష్ క‌స‌ర‌త్తులు చేయ‌నున్నాడు.