రేష్మీ కోరిక తీరేదెప్పుడు?

బుల్లితెర యాంకర్‌గానూ సోలో పర్‌పార్మెన్స్‌ చేస్తోంది అందాల రేష్మీ గౌతమ్‌. వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన నాటి నుండీ థ్రిల్లర్‌ మూవీస్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యింది. వరుసపెట్టి ధ్రిల్లర్‌ మూవీస్‌నే ఎంచుకుంటోంది. ఒకదానితో ఒకటి వాటిలో అవే పోటీపడుతున్నాయి తప్ప రేష్మీ సినిమాలు ఇంకే సినిమాకి పోటీగా నిలవడం లేదు. ‘గుంటూర్‌ టాకీస్‌’ సినిమా పబ్లిసిటీ పరంగా సక్సెస్‌లో ఓకే అన్పించినా, ఆ తరువాత వచ్చిన ‘అంతం’ అయితే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో తెలీదు. ఇంకా వరుస సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

‘చారుశీల’, రాణిగారి బంగ్లా’ వంటి సినిమాలు కూడా థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే. ఈ సినిమాలన్నింట్లోనూ రేష్మి సోలో పెర్‌ఫార్మరే. ఆమె చుట్టూ తిరిగే కథలు మాత్రమే ఈ సినిమాలన్నీ. అక్కడక్కడా అంతగా పాపులర్‌ కాని హీరోతో ఓవర్‌ డోస్‌లో రొమాన్స్‌, అందాల ఆరబోత..ఇలాగే ఉంది రేష్మీ సినిమా కెరీర్‌. అంతే కానీ ఒక మాదిరి పేరున్న ఏ ఒక్క యంగ్‌ హీరోతోనూ రేష్మీకి రొమాన్స్‌ చేసే అవకాశం రావడం లేదు.

రేష్మీలో మంచి నటి దాగుంది. అందాల ఆరబోతే కాకుండా ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించగల సత్తా ఉంది రేష్మీలో. కానీ మంచి టర్నింగ్‌ రావాలి. అవకాశం వస్తే చెలరేగిపోతానంటోంది. ఎంట్రీ దగ్గర్నుంచీ, గ్లామర్‌ ఒలకబోస్తూ, భయపడుతూ, భయపెట్టే క్యారెక్టర్‌లో నటించి బోర్‌ కొట్టేసిందంటోంది. ఏదైనా మంచి పాత్రలో నటించాలనుంది అంటోంది ముద్దుగుమ్మ రేష్మీ. హీరోయిన్‌గా కాకపోయినా, నటనకు స్కోప్‌ ఉన్న చిన్న క్యారెక్టర్‌ అయినా పెద్ద హీరో సినిమాలో చేయాలనుకుంటున్నానని చెబుతోంది. మరి రేష్మీ కోరిక తీరేదెప్పుడు?