శాతకర్ణి రిలీజ్ డేట్ అదేనా!!!

జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఆధారంగా బాలకృష్ణ నటిస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కొద్దిరోజుల క్రితం ప్రారంభమై మొదటి షెడ్యూల్‌ని మొరాకోలో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించిన దర్శకుడు క్రిష్ రెండవ షెడ్యూల్‌లో కూడా హైదరాబాద్ దగ్గర చిలుకూరు బాలాజీ దేవాలయం దగ్గర వేసిన సెట్‌లో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు.త్వరలో ప్రారంభం అవుతున్న మూడో షెడ్యూల్ లో కూడా చిలుకూరు బాలాజీ దేవాలయం దగ్గర వేసిన సెట్ లోనే దాదాపు 200 మంది ఫారిన్ ఫైటర్స్ తో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఓ భారీ ఓడలో భారీస్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిం చబో తున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో వరుసగా యుద్ధ సన్నివేశాలు మాత్రమే చిత్రీకరిస్తుండటంతో ఇప్పుడు సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో కథ దృష్ట్యా యోధుడు అయిన గౌతమీపుత్ర శాతకర్ణి ఎక్కువ యుద్ధాల్లో పాల్గొంటాడు. అందువల్ల ఈ సినిమాలో ఎక్కువ యుద్ధసన్నివేశాలుండబోతున్నట్టు సమాచారం. అంతేకాకుండా గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల తేదీని జనవరి 2017 గా నిర్ణయించడంతో ఈ యుద్ధసన్నివేశాలకు తగిన విధంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ రూపొందించడానికి ఎక్కువ సమయం కావాల్సిఉండటంతో ముందు వరుసగా యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బాహుబలి సినిమా కి సిజి వర్క్ అందించిన మకుట సంస్థ ఈ సినిమాకి పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న బాలకృష్ణ హైదరాబాద్ చేరుకున్నారు. శ్రేయ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ ఈ నెల 20 న ప్రారంభం అవుతుందని సమాచారం.