సానియా జీవితం లోకి సోనాక్షి!

భారత టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా ‘జీవిత చరిత్ర’ను సినిమాగా తెరకెక్కనుందట. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడొకరు సానియా మీర్జా జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నారు. పుస్తక రూపంలో ఇటీవలే సానియా జీవిత చరిత్రను నేటి యువతకోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, సానియా మీర్జా జీవిత చరిత్రను తెరకెక్కించడానికీ రంగం సిద్ధమైనట్లు తెలియవస్తోంది.

ఎప్పటినుంచో జరుగుతున్న ఆ ప్రయత్నాలకు కార్యరూపం జరిగే తరుణం వచ్చింది. బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ ఈ ప్రాజెక్ట్‌ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు షారూఖ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. తన సన్నిహితుల వద్ద షారుక్‌ఖాన్‌ ఈ విషయాన్ని ప్రస్తావించాడని తెలియవస్తోంది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో జీవిత చరిత్రలు సినిమాగా తెరకెక్కించడం అనే ట్రెండ్‌ నడుస్తోంది. బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. ప్రియాంకా చోప్రా ఇందులో నటించింది. జీవిత చరిత్రల్లో నటించడమంటే కత్తిమీద సాము లాంటిదే. మేరీ కోమ్‌లా కనిపించేందుకు ప్రియాంకా చోప్రా పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అలాగే క్రికెటర్‌ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా కూడా మరో సినిమా రూపొందింది. ఏదేమైనా సానియాలా కనిపించాలంటే, సోనాక్షి కూడా ఆమెలా టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకుని, ప్రాక్టీస్‌ చెయ్యాల్సిందే.