
బాబోయ్.. ఇదేం కర్మ..! రియాలిటీ షోల రూపంలో మతిలేని ప్రోగ్రామ్స్.. ఒకదాని తర్వాత ఒకటి కత్తిగట్టి జనం మీదకు దూసుకొస్తున్నాయి.. మొన్నటికి మొన్న బిగ్‌బాస్ సీజన్-2 ఇలా అయిపోయిందో లేదో.. పెళ్లి చూపుల రూపంలో బుల్లితెరపై కొత్తలొల్లి మొదలైంది. బొత్తిగా బుద్ధిలేని సుత్తి ప్రోగ్రామ్.. మగ మహారాజు స్వయంవరం ఒకారం పుట్టిస్తోంది.. అతడి మనసు గెలుచుకోవడానికి 14మంది అమ్మాయిలు తంటాలు పడుతుంటే.. చూసే వాళ్ల ఒళ్లు మండిపోతోంది. అతగాడి కోసం ఆ అమ్మాయిలు చేసే టాస్క్‌లు చూస్తుంటే.. ఈ బుల్లితెరకు ఏమైంది.. అన్న భావన కలుగుతోంది. చానల్ రేటింగే పరమావధిగా చేస్తున్న ఈ షోలపై తీవ్ర విమర్శలు వస్తున్నా.. చూస్తున్నారు.. చూపిస్తున్నాం.. అంటూ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు.
నిజానికి.. తెలుగులో బిగ్‌బాస్ సీజన్ వన్‌పైనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏంది లొల్లి అంటూ జనం తీవ్ర అసంత`ప్తికి లోనయ్యారు. అవేమీ పట్టించుకోకుండా.. బిగ్‌బాస్ సీజన్-2 వచ్చింది. అయిపోయింది. అసలు ఈ షోల ద్వారా జనానికి ఏం చెప్పాలనుకన్నారనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఇక సీజన్ -2 ఇలా అయిపోయిందో లేదో.. మరో రియాలిటీ షో.. బుల్లితెరపై పెళ్లిగోల.. అదేనండి యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు పేరుతో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్-2 తర్వాత రేటింగ్స్ పెంచుకోడానికి మాటీవీ స్టార్ట్ చేసిన కొత్త గేమ్ షో ఇది. నిజానికి తెలుగుకు కొత్తగానీ.. హీందీ, తమిళంలో పాతనే. వాటినే ఇక్కడ కాపీ కొడుతూ రోత పుట్టిస్తున్నారు. నిజానికి.. అక్కడ చాలా ఏళ్ల క్రితమే ఇలాంటి కాన్సెప్ట్‌తో షోలు చేశారు. ఇప్పుడు వాటి వెలుగులోనే తెలుగు జనంమీద రుద్దుతున్నారు.
ఇక ఈ పెళ్లి చూపుల రియాలిటీ షోలో పలువురు అమ్మాయిలు చెబుతున్న డైలాగ్స్ రోత పుట్టిస్తున్నాయి. యువత మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయి. ప్రదీప్‌పై చాలా మంది అమ్మాయిలు మనసు పడేసుకోవచ్చు. కానీ.. దానిని రియాలిటీ షో పేరుతో.. మనీగా మార్చుకోవడం నిర్వాహకులకు ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నాయి. ఒక అమ్మాయి మాటల్ని చూద్దాం.. `ఐ లవ్యూ ప్రదీప్, మనిద్దరికీ ఎప్పుడో పెళ్లైపోయిందనుకుంటున్నా, మన ఇద్దరికీ పాప పుడుతుందని కలగన్నా, ఆమెకు పేరుకూడా పెట్టేశా` అంటూ ఆమె చెబుతుంటే.. ఏందీ మాటలు.. ఒకవేళ ఈ అమ్మాయిని ప్రదీప్ పెళ్లి చేసుకోకుంటే..రేపు వేరెకొరిని పెళ్లి చేసుకుని సంసారం ఎలా చేస్తుందంటూ.. జనం అనుకుంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. టాస్క్‌లు గెలిచిన అమ్మాయి.. మనసుకు కనెక్ట్ కాకపోతే.. పరిస్థితి ఏమిటి..?