
విడుదల తేదీ: 27 Sep, 2018
దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య
సంగీత దర్శకుడు: మణి శర్మ
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్
ప్రొడక్షన్ హౌస్: వైజయంతి మూవీస్
నటీనటులు: నాగార్జున, నాని, రష్మికమందన్న, ఆకాంక్షసింగ్
తెలుగు తెరకు మల్టీస్టారర్ సినిమాలు కొత్తమి కాదు.. అది ఆ తరం నటుల నుంచి ఈ తరం నటులదాకా వస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా వచ్చేందే దేవదాస్. ఇందులో తరగని అందగాడు నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ఈ చిత్రం వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. అయితే.. టాలీవుడ్లో నాగార్జునకు ఉన్న ఫాలోయింగ్, నానికి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే.. అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. అందులోనూ నాగ్ మరింత యవ్వనంగా కనిపిస్తే.. ఇక అమ్మాయిలు వదిలేస్తారా..? అరవైకి దగ్గరలో ఉన్న నాగ్ అంత ఫిట్నెస్తో కనిపిస్తుంటే ఊరుకుంటారా..? అబ్బబ్బబ్బ.. ఇక ఆ సందడే వేరనుకోండి. అయితే.. నాగ్, నానిల జోడి ప్రేక్షకులకు ఏమేరకు మెప్పించిందో చూద్దాం…
కథేమిటంటే..: దేవ పాత్రలో నాగార్జున, దాస్ పాత్రలో నాని నటించారు. దేవ బడా డాన్. ఎక్కడ ఉంటాడో.. ఎలా ఉంటాడో.. ఎవరికీ తెలియదు.. కానీ.. ఆయన అంటేనే అందరికీ భయం. వణికిపోతారు. ఇక నాని ప్రముఖ డాక్టర్. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఇమడలేక బటయకు వచ్చే స్తాడు. ఆ తర్వాత ఆయన ధూల్‌పేటలోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగం దొరుకుతుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే.. పోలీసులు వేటాడే క్రమంలో నాగ్ గాయపడిన నాని ఆస్పతికి వస్తాడు. ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఈ క్రమంలోనే వారి మధ్య స్నేహం చిగురిస్తుంది. ఇన్స్పెక్టర్ పూజ (రష్మిక)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు నాని. ఇక యాంకర్ జాహ్నవి అంటే దేవకి చాలా ఇష్టం. ఇలా సాఫీగా సాగిపోతున్న కథలో ఓ మలుపుతో దాస్ నుంచి దేవ దూరమవుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది..? వారు కలిశారా.. లేదా..? అన్నది తెరపైనే చూడాలి మరి.
ఎలా ఉందంటే..: నాగ్, నానిల కాంబినేషన్నే నమ్ముకున్నాడు దర్శకుడు. డాన్, డాక్టర్ మధ్య సాగే సరదా సరదా సన్నివేశాలను కథాంశాలుగా తీసుకుని నడిపించాడు. మధ్యమధ్యలో కొన్ని భావోద్వేగభరిత సన్నివేశాలు ఉండేలా జాగ్రత్తపడ్డాడు. ఈ సినిమాలో రెండు పాటలు కూడా బాగున్నాయి. ఆ పాటల లొకేషన్లు ప్రేక్షకులను ఎక్కడికో తీసుకెళ్తాయి. మరోవైపు కొన్ని యాక్షన్ సీన్లు మాత్రం అదుర్స్ అనిపిస్తాయి. అయితే.. మొదటి భాగంలోనే అన్ని పాత్రలను పరిచయం చేసే క్రమంలో కొంత గందరగోళం ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక రెండో భాగంలో కొన్నిసన్నివేశాలు సాదాసీదాగా ఉంటాయి. ఎండింగ్లో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండునేమోనని అనిపిస్తుంది. అవేమిటో తెరమీదే చూడాలి. అయితే మొత్తానికి దర్శకుడు తాను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పాడని చెప్పొచ్చు.
ఎవరెలా చేశారంటే..: నాగార్జున, నాని తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పొచ్చు. ఈ సినిమాలో నాగ్ మరింత ఫిట్‌గా కనిపించాడు. ఇక ఇందులో నాని మరింత స్మార్ట్‌గా కనిపించాడు. అన్నగా సీనియర్ నరేష్, ఆయన భార్యగా సత్యకృష్ణ, హాస్పిటల్ ఛైర్మన్‌గా ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం, సీనియర్ డాక్టర్‌గా రావు రమేశ్, సైకాలజిస్ట్ గా వెన్నెల కిశోర్…పోలీస్ ఆఫీసర్‌గా మురళీ శర్మ, ఇన్స్పెక్టర్గా రష్మిక, యాంకర్‌గా ఆకాంక్ష తమ పాత్రలకు జీవం పోశారు. శ్యామ్ తన కెమెరాతో కొన్ని షాట్లలో మెస్మరైజ్ చేశారు. మొత్తంగా సినిమాలో కొన్ని సన్నివేశాలు బోర్కొట్టించినా.. మరికొన్ని గందగోళంగా ఉన్నా.. అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్లి చూస్తే మాత్రం నాగ్-నాని జోడీ సరదా హాయిగొలుపుతుందని చెప్పొచ్చు. కథలో ఆత్మ మిస్ అయినా.. పాత్రలు మాంత్ర అలరిస్తాయి.
చివరిగా.. కంటెంట్ లేకున్నా..కటౌట్లు ఓకే..
ఆత్మ మిస్ అయినా పాత్రలు అలరిస్తాయి
రేటింగ్ :3/5