నంద‌మూరి ఫ్యామిలీని ఒక్క‌టి చేస్తోన్న ఎన్టీఆర్‌

ఉమ్మ‌డి ఏపీ రాజ‌కీయాల‌ను త‌న‌దైన శైలిలో మార్చేసిన విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర త్వ‌రోనే వెండితెర‌కు ఎక్క‌నుంది. అన్న‌గారి గురించి తెలియంది ఎవ‌రికి? ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా? అనే వారూ ఉన్నారు. అయితే, నేటి త‌రానికే కాదు.. పాత త‌రానికి కూడా తెలియ‌ని అనేక విష‌యాలు ఎన్టీఆర్ జీవితంలో అనేకం ఉన్నాయి. విజ‌య‌వాడ ఎస్ ఆర్ ఆర్ క‌ళాశాల‌లో చ‌దువు ద‌గ్గ‌ర నుంచి గాంధీ న‌గర్‌లో పాలు అమ్మే వ‌ర‌కు… అక్క‌డి నుంచి మ‌ద్రాస్ ప‌య‌నం, హీరోగా అవ‌కాశం, త‌ర్వాత వివాహం..ఇలాంటి అనేక విష‌యాల్లో ఆస‌క్తిక‌ర‌మైన కోణాలున్నాయి.

వీటిని వెలికి తీసి తెలుగు ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి అన్న‌గారి విశ్వ‌రూపాన్ని చూపించాల‌ని భావిస్తున్నాడు ఆయ‌న త‌న‌యుడు , హీరో బాల‌య్య‌. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే ఆయ‌న ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా బ‌యోపిక్ తీసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అయితే, ఈ చిత్రంలో అన్న‌గారిగా బాల‌య్య న‌టిస్తుండ‌గా.. ఆయ‌న అల్లుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు పాత్ర స‌హా కుటుంబ స‌భ్యుల పాత్ర‌ల‌ను ఎవ‌రు వేస్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే దీనికి చెక్ పెడుతూ.. బాల‌య్య.. నంద‌మూరి వంశాన్ని వంశాన్నే తెర‌మీద‌కి తెచ్చేస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు అంటీ ముట్ట‌న‌ట్టు ఉన్న తార‌క్.. జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌హా హ‌రికృష్ణ‌, క‌ళ్యాణ్ రామ్ ల‌ను రంగంలోకి దింపి వారికి కీల‌క రోల్స్ ఇవ్వాల‌ని బాల‌య్య ప్లాన్ చేస్తున్నారు. ఇలా నంద‌మూరి ఫ్యామిలీ అంతా వెండి తెర‌పై క‌నిపిస్తే.. తెలుగు ప్రేక్ష‌కులు మంత్ర ముగ్ధులు అవుతార‌ని బాల‌య్య భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అదికూడా 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి కొద్దిగా అటు ఇటు అన్న‌ట్టుగా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇటు కుటుంబం ప‌రంగా నంద‌మూరి అభిమానులు ఆక‌ట్టుకోవ‌డం, మ‌రోప‌క్క‌, పొలిటిక‌ల్ ప‌రంగా జ‌గ‌న్ ప్ర‌భావానికి బ్రేక్ వేసే ల‌క్ష్యంతో బాల‌య్య ప‌క్కా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నార‌ట‌. మ‌రి తెలుగు ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.