ఏపీలో `నందుల‌` ర‌గ‌డ‌కు కులం కుంప‌టి..!

ఏపీ ప్ర‌భుత్వం క‌ళా రంగానికి ఇస్తున్న నంది పుర‌స్కారాలు ఈ ద‌ఫా తీవ్ర వివాదాన్ని రాజేశాయి. ముఖ్యంగా కులం కుంప‌ట్ల‌ను రాజేశాయి. సినిమా ఇండ‌స్ట్రీలో ప్రారంభ‌మైన అసంతృప్తి.. ఇప్పుడు కులాల కురుక్షేత్రం వ‌ర‌కు దారితీసింది. విష‌యంలోకి వెళ్తే.. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో 2014 లోనే ప్ర‌క‌టించాల్సిన నంది పుర‌స్కారాల‌ను ఆ త‌ర్వాత 2015లోను, గ‌త ఏడాది ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగాను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌లేదు. అయితే, ఇటీవ‌ల ఈ మూడు సంవ‌త్స‌రాల‌కు సంబంధించి ప్ర‌భుత్వం ఒకేసారి నందుల‌ను ప్ర‌క‌టించింది.

ఈ ప్ర‌క‌ట‌నే ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసిన గుణ‌శేఖ‌ర్ మూవీ రుద్ర‌మ‌దేవికి క‌నీసం ఏ ఒక్క విభాగంలోను అవార్డును సొంతం చేసుకోలేక పోయింది. దీంతో గుణ‌శేఖ‌ర్ తీవ్రంగానే రియాక్ట్ అయ్యాడు. ఇక‌, నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ.. అవి నంది అవార్డులు కాదు సైకిల్‌ అవార్డులు అంటూ కౌంటర్‌ వేశాడు. ఏపీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వారికి మాత్రమే అవార్డులు దక్కడం పట్ల కొందరిలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. తాజాగా ఆ జాబితాలో నిర్మాత నల్లమల్లపు బుజ్జి కూడా చేరాడు. ఈయన నంది అవార్డులపై మరింత ఘాటుగా వ్యాఖ్యానించాడు.

ఈయన నంది అవార్డులకు కులం రంగు పులిమారు. ఇవి నంది అవార్డులు కావని, కమ్మ అవార్డులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను నిర్మించిన ‘రేసుగుర్రం’ చిత్రం అన్ని విభాగాల్లో కూడా అవార్డు దక్కించుకునేందుకు అర్హం అయిన సినిమా. కాని ఒక్క విభాగంలో కూడా నంది అవార్డు రాకపోవడం చూస్తే ఇది ఖచ్చితంగా కమ్మ అవార్డులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, క‌ళా రంగాన్ని ప్రోత్స‌హించే క్ర‌మంలో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సొమ్ముతో ఇచ్చే అవార్డుల‌పై కొంత అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. కొన్ని పొర‌పాట్లు జ‌రిగీ ఉండొచ్చు. కానీ, ఇలా నందుల‌కు కులం కార్డు తొడ‌గ‌డంపై మాత్రం స‌ర్వ‌త్రా అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌తంలో మ‌గ‌ధీర‌కు 12 విభాగాల్లో 12 నందులు ల‌భించ‌డం ఇప్పుడు ప్ర‌స్తావ‌నార్హం.

ఏ రంగంలోనైనా స‌రైన గుర్తింపు ల‌భించ‌లేద‌ని బాధ‌ప‌డుతున్న వారు, బాధ‌ప‌డ్డ వారు అనేక మంది ఉన్నారు. దీనికి ప్ర‌త్యామ్నాయంగా విమ‌ర్శ‌లు కూడా ఉండాలి త‌ప్ప‌. త‌మ‌కు మంచి జ‌రిగితే పొంగిపోవ‌డం, లేక‌పోతే.. వెంట‌నే కులం కార్డు ప్ర‌యోగించ‌డం వంటివి సృజ‌నాత్మ‌క రంగంలో ఉన్న‌వారికి స‌మంజ‌సం కాదు. ఏదేమైనా.. రుద్ర‌మ‌దేవి వంటి చ‌రిత్రాత్మ‌క మూవీకి అవార్డు రాక‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతూనే ఉంది. అయినా విమ‌ర్శ‌ల‌కు నియంత్రణ‌, వివేచ‌న అవ‌స‌రం ఉంది. ఈ ఒక్క అంశంతోనే.. క‌ళా రంగానికి అన్యాయం జ‌రిగిపోయింద‌ని భావించాల్సిన అవ‌స‌రం లేదేమో కూడా!