నాని రేటు పెంచేశాడు…. స్టార్ హీరోలకు ధీటైన రెమ్యున‌రేష‌న్‌

టాలీవుడ్‌లో వరుస హిట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న నేచుర‌ల్ స్టార్ నాని త‌న రేటు పెంచేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యంతో స్టార్ట్ అయిన నాని వ‌రుస విజ‌యాల ప‌రంప‌ర నిన్ను కోరి సినిమాతో ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. ఈ సినిమాతో వ‌రుస‌గా ఏడో హిట్‌ను సొంతం చేసుకున్న నాని ఇప్పుడు మినిమ‌మ్ గ్యారెంటీ హీరో అయిపోయాడు.

నాని సినిమాలు రూ. 30 కోట్ల బిజినెస్ ఈజీగా చేస్తున్నాయి. నేను లోక‌ల్ సినిమాతో బ‌య్య‌ర్ల‌కు భారీగా లాభాలు తెచ్చిపెట్టిన నాని ఆ సినిమాకు రూ. 5 కోట్లు తీసుకున్నాడ‌ట‌. ఇప్పుడు నిన్ను కోరి సినిమా ఫ‌స్ట్ వీక్‌కే రూ. 30 కోట్ల వ‌సూళ్ల‌కు ద‌గ్గ‌ర‌వుతోంది. దీంతో నాని బిజినెస్ మ‌రింత పెరిగిన‌ట్ల‌య్యింది.

ఈ సినిమాకు మొత్తం పెట్టిన బ‌డ్జెట్ రూ. 18 కోట్ల లోపేన‌ట‌. ఇక వరుస హిట్ల‌కు తోడు, మార్కెట్ పెర‌గ‌డం, శాటిలైట్ బిజినెస్ పెర‌గ‌డంతో నాని త‌న రేటు పెంచేశాడ‌ని తెలుస్తోంది. ఓ స్టార్ హీరో తీసుకునే రెమ్యున‌రేష‌న్ నాని డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. నిన్న‌టి వ‌ర‌కు ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లు తీసుకున్న నాని ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌ట‌.

నాని ప్ర‌స్తుతం మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. ప్ర‌స్తుతం దిల్ రాజు బ్యాన‌ర్‌లో మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించిన నాని, మ‌రో రెండు సినిమాల‌కు సైతం క‌మిట్ అయిన‌ట్టు తెలుస్తోంది. వ‌రుస హిట్ల‌తో నాని టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒక‌డిగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.