
దసరా.. సంక్రాంతి.. సినిమాలకు వసూళ్ల పర్వం తెస్తాయి. ఈ రెండు పండుగలకు మార్కెట్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇక తమ అభిమాన హీరో సినిమా అయితే.. అందులోనూ పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఇక చెప్పనక్కరలేదు. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. అయితే.. అదేస్థాయిలో సినమాల మధ్య పోటీ కూడా ఉంటుంది. అగ్రహీరోల సినిమాలన్నీ పండుగలకు ముందు కొంచెం అటు ఇటు విడుదల అవుతాయి. ఇందులోనూ సంక్రాంతికి ఆంధ్ర, రాయలసీమలో సందడి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈసారి వచ్చే సంక్రాంతి పండుగకు కూడా పలు అగ్రహీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఒకటి. ఈ సినిమా విడుదలపై ఇటీవల ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ బయోపిక్‌లో నందమూరి బాలకృష్ణ కీ రోల్ పోషిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యబాబు, బసవతారకం పాత్రలో విద్యాబాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా లాంటి అగ్రహీరోలు నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలో విడుదల చేసిన బాలకృష్ణ, రానా ఫస్ట్ లుక్ పోస్టర్లు తెగ వైరల్ అవుతన్నాయి. సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. సంక్రాంతి విడుదల చేయాలని చిత్రయూనిట్ శరవేగంగా కసరత్తు చేస్తోంది. అయితే.. విశ్వవిఖ్యాత నటుడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ బయోపిక్కు ఎలాంటి పోటీ లేకుండా చూడాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మిగతా సినిమాల నుంచి పోటీ లేకుండా చూసి, అన్నగారి సినిమాకు జనం బ్రహ్మరథం పట్టేలా చూడాలన్న పట్టుదలతో సినిమా యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ప్రాజెక్టును బాలయ్య బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇందు కోసం ఎంత బడ్జెట్‌కైనా వెనుకాడేది లేదని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. తెలుగు సినీ చరిత్రలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా నిలిచిపోయేలా రూపొందించాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. అందుకే ఈ సినిమా విడుదలకు పోటీ లేకుండా.. అన్నగారి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆనందంగా ఆస్వాదించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఆ బాధ్యతను దగ్గుబాటి సురేశ్‌బాబుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈయన చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం సంక్రాంతి బరిలో రెండు సినిమాలు ఉన్నాయి. నిజానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర బయోపిక్‌ను సంక్రాంతికి విడుదల చేయాలని ముందు భావించారు. ఆ తర్వాత యాత్రను డిసెంబర్లోనే విడుదల చేయాలని చిత్రయూనిట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక రెండు సినిమాలు పోటీగా ఉన్నాయి. ఒకటి డివివి దానయ్య-రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లో తయారవుతున్న భారీ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. అలాగే దిల్ రాజు-అనిల్ రావిపూడి-వెంకీ-వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 కూడా సంక్రాంతికే విడుదల అవుతుంది. ఇప్పుడు వీటి విడుదల డేట్ లు మార్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆ రెండు సినిమాల యూనిట్లతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. తెలుగు సినీరంగంలో, రాజకీయ రంగంలో చెరగని ముద్రవేసిన అన్నగారికి మనం ఇచ్చే గౌరవంగా భావించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటివరకు ఆ రెండు సినిమాల చిత్రయూనిట్ల నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్ బయోపిక్కు ఎలాంటి లేకుండా చూసే బాధ్యతలు తీసుకున్న సురేష్‌బాబు ఏమేరకు వారిని మెప్పిస్తారో… ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.