బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొన్నేళ్లుగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. 11 వరుస రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా సల్మాన్ తిరుగులేని రికార్డును తన అక్కౌంట్లో వేసుకున్నాడు. వరుస ప్లాపులతో ఉన్న సల్మాన్ కెరీర్‌ను వాంటెడ్ (తెలుగులో పోకిరి రీమేక్) మలుపు తిప్పింది. తర్వాత దబాంగ్ దెబ్బతో సల్మాన్ పీక్స్‌లోకి వెళ్లిపోయి ఇక వెనక్కి తిరిగి చూడలేదు.
దబాంగ్ తర్వాత వచ్చిన దబాంగ్ 2 కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ‘దబాంగ్ 3′ మూవీకి కొరియోగ్రఫర్నుంచి దర్శకుడిగా మారి సక్సెస్ఫుల్ దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్న ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది.
సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాలో సల్మాన్ ఇన్స్పెక్టర్ చుల్బుల్ పాండే పాత్రలో కనిపిస్తాడట. ‘టైగర్ జిందా హై’ చిత్రం షూటింగ్ పూర్తైన తర్వాత దీని చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది.
దబాంగ్ సీరిస్‌లో తొలి రెండు సినిమాల్లో సోనాక్షి సిన్హా హీరోయిన్. అయితే మూడో పార్ట్‌లో సల్మాన్ పక్కన రొమాన్స్ చేసే ఛాన్స్ అమీజాక్సన్‌కు దక్కినట్టు తెలుస్తోంది.