ర‌వితేజ రేటు పెంచేశాడుగా…

రాజా ది గ్రేట్ విడుదల తరువాత హీరో రవితేజ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. రెండేళ్ల క్రితం బెంగాల్ టైగ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఆ త‌ర్వాత జ‌నాలు మ‌ర్చిపోవ‌డంతో ఎట్ట‌కేల‌కు రాజా ది గ్రేట్ సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన ర‌వితేజ ఇప్పుడు వ‌రుస‌గా సినిమాల‌కు రెడీ అవుతున్నాడు. ట‌చ్ చేసి చూడు సినిమాలో న‌టిస్తోన్న ర‌వితేజ ఆ వెంట‌నే యూవీ క్రియేష‌న్స్‌, బండ్ల గ‌ణేష్ బ్యాన‌ర్‌లో సినిమాల‌కు ఓకే చెప్పిన‌ట్టు వినికిడి.

రాజా ది గ్రేట్ సినిమాతో ఒక్క‌సారిగా ఫామ్‌లోకి రావ‌డంతో మ‌నోడు రేటు పెంచేసిన‌ట్టు తెలుస్తోంది. కిక్ 2 సినిమా వ‌ర‌కు ర‌వితేజ రూ.8 కోట్ల రేంజ్‌లో ఉండేవాడు. ఆ త‌ర్వాత బెంగాల్ టైగ‌ర్‌కు రూ.10 కోట్లు తీసుకున్నాడు. ఇక ఇప్పుడు త‌న మార్కెట్ బాగా పెర‌గ‌డంతో పాటు త‌న సినిమాల‌కు ఇత‌ర భాష‌లు, డిజిట‌ల్ రైట్స్ ద్వారా కూడా బాగానే గిట్టుబాటు అవ్వ‌డంతో రేటు పెంచేసిన‌ట్టు తెలుస్తోంది. ర‌వితేజ ప్ర‌స్తుత డిమాండ్ రూ.13 కోట్ల ఫిగ‌ర్‌కు కాస్త అటూ ఇటూగా ఉంది.

రవితేజ సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. రాజా ది గ్రేట్‌కు ఏకంగా రూ. 7 కోట్ల రెవెన్యూ వ‌చ్చింది. తెలుగు శాటిలైట్ రైట్స్ మాత్ర‌మే రూ.11 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. ఇక డిజిట‌ల్ రెవెన్యూ ఏకంగా రూ.18 కోట్లు వ‌చ్చింది. ఈ లెక్క‌న థియేట్రిక‌ల్ రైట్స్ కాకుండా పై మూడు ర‌కాలుగానే ఈ సినిమాకు రూ.36 కోట్లు వ‌చ్చాయి. ఈ లెక్క‌న ర‌వితేజ త‌న రేటును రూ.13 కోట్ల‌కు పెంచ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌.