ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ అప్డేట్ : అల్లూరిగా రాంచ‌ర‌ణ్‌.. కోమ‌రం భీంగా ఎన్టీఆర్‌..

March 14, 2019 at 12:28 pm

టాలీవుడ్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిస్తున్న‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌( వ‌ర్కింగ్ టైటిల్‌). రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన విశేషాలపై ఇప్ప‌టికే అనేక ఊహాగానాలు విపిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ పాత్ర‌లు ఎలా ఉండబోతున్నాయి..? వారికి జోడీగా ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నారు..? అన్న ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే.. రాజ‌మౌళి త‌న స‌హ‌జ‌త్వానికి భిన్నంగా ఈసారి ముందే చిత్ర విశేషాల‌ను వెల్ల‌డించారు.

మీడియా సమావేశం నిర్వహించిన‌ దర్శకుడు రాజమౌళి సినిమా కథా కథనాలు, నటీనటుల విశేషాలను వెల్లడించారు. ఆర్‌ఆర్ఆర్‌ 1920లో ఉత్తర భారతదేశంలో జరిగే కథను తీసుకుని తెరకెక్కిస్తున్నట్టుగా రాజ‌మౌళి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్‌ పాయింట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే.. ఈ సినిమాలో అల్లూరి సీతారామారాజుగా రామ్‌ చరణ్‌.. కోమ‌రంభీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్న‌ట్లు పేర్కొన్నారు.

అంతేగాకుండా.. మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని కూడా రాజ‌మౌళి వెల్ల‌డించారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఓ కీల‌క‌ పాత్రలో అజయ్‌ కనిపించనున్నార‌ని.. ఇక చరణ్‌కు జోడిగా బాలీవుడ్ భామ‌ అలియా భట్ నటిస్తున్నారని, ఎన్టీఆర్‌కు జోడిగా ఫారిన్ హీరోయిన్ న‌టించ‌నున్న‌ట్లు చెప్పారు. అలాగే.. కీలక పాత్రలో తమిళ నటుడు సముద్రఖని నటిస్తున్నారని.. 2020 జూలై 30న తెలుగు, హిందీ, తమిళ, మళయాల భాషలతో పాటు దాదాపు 10 భారతీయ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టుగా నిర్మాత దానయ్య వెల్ల‌డించారు.

ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ అప్డేట్ : అల్లూరిగా రాంచ‌ర‌ణ్‌.. కోమ‌రం భీంగా ఎన్టీఆర్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share