ఒక్క హిట్టు కోసం ప‌రితపిస్తున్న ముగ్గురు డైరెక్ట‌ర్లు

February 19, 2018 at 10:21 am
Srinu Vaitla, VV Vinayak, Trivikram Srinivas, Tollywood Top Directors,

ఒకే ఒక్క సినిమా డైరెక్ట‌ర్ల జీవితాలను త‌ల్లకిందులు చేసేస్తుంది. ఓవ‌ర్‌నైట్‌లో ఆకాశానికి తీసుకెళుతుంది!! అంతే వేగంగా అక్క‌డి నుంచి అధఃపాతాళానికి తోసేస్తుంది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు తీసి, బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టి.. హీరోల‌కు కెరీర్ మ‌లుపు తిప్పే చిత్రాలు తీసిన ముగ్గురు టాలీవుడ్ ద‌ర్శ‌కులు ఇప్పుడు.. సినీ నిరుద్యోగులుగా మారిపోయారు. ఈ ముగ్గురి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని ఒక‌ప్పుడు కోరుకున్న హీరోలు.. ఇప్పుడు వీరితో సినిమా అన‌గానే ఆలోచిస్తున్నారు. ప్రేక్ష‌కుల నాడిని ఒడిసిప‌ట్టి హిట్లు కొట్టిన వీరికి.. ఇప్పుడు ప్రేక్ష‌కుల నాడి దొర‌క‌డం లేదనే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. క‌థ‌ను ఎంచుకోవ‌డంలో లోప‌మో.. లేక క‌థ‌నంలో లోప‌మో.. ఏమైందో తెలియ‌దుగాని వీరు మాత్రం వరుస ప‌రాజ‌యాలు ఎదుర్కోవ‌డం స‌గ‌టు సినీ ప్రేక్ష‌కులను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది!!

 

త‌న కామెడీతో తెలుగు సినిమాను కొత్త ఒవ‌ర‌డిలోకి తీసుకెళ్లిన వారు ఒకరు!! మాస్ ప‌ల్స్‌ను తెలుసుకుని.. `హీరోకి మాస్ ఇమేజ్ రావాలంటే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క‌సారి న‌టిస్తే చాలు` అనిపించుకున్న వారు మ‌రొక‌రు!! ఇక కామెడీ డైలాగుల‌కి వెట‌కారాన్ని జోడించి ప్రాస‌లతో సెటైర్లు, పంచులు వేయ‌డం నేర్పిన మాట‌ల మాంత్రికుడు ఇంకొక‌రు!! ఇలా ఎవ‌రి శైలి వారికి ప్ర‌త్యేక‌మే అయినా ఇప్పుడు ముగ్గురు స్టార్ డైరెక్ట‌ర్లు సంధి ద‌శ‌లో ఉన్నారు. శ్రీ‌నువైట్ల‌, వినాయ‌క్ , త్రివిక్ర‌మ్‌… ఒక‌ప్పుడు వ‌రుస విజ‌యాలు సాధించి, స్టార్ డైరెక్ట‌ర్లుగా వెలుగొందిన తెలుగు ద‌ర్శ‌కులు, ఇప్పుడు తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి భ‌రించలేని ప‌రాజ‌యాల‌ను అందిస్తున్నారు. 

 

కేరెక్ట‌ర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న‌ ర‌వితేజ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ `నీకోసం` సినిమా తీశాడు శ్రీ‌నువైట్ల‌. ఆ త‌ర్వాత ర‌వితేజ రేంజే మారిపోయింది. త‌ర్వాత ఆనందం, సొంతం, ఆనంద‌మానంద‌మాయే వంటి సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ర‌వితేజ‌తో  వెంకీ సినిమాతో మ‌రో సూప‌ర్‌హిట్ కొట్టాడు. ఆ సినిమాతో ఒక్క‌సారిగా మెగాస్టార్‌తో సినిమా చేసే అవ‌కాశం కూడా ద‌క్కించుకున్నాడు. చిరంజీవితో తీసిన అంద‌రివాడు ఫ్లాప్ కావ‌డంతో శ్రీ‌ను ప‌ని అయిపోయింద‌నుకున్నారు. కానీ  మంచు విష్ణుతో ఢీ సినిమా తీసి ఫామ్‌లోకి వ‌చ్చాడు. త‌ర్వాత దుబాయ్ శ్రీ‌ను, రెఢీతో గాడిలో ప‌డ్డాడు. ఈసారి నాగార్జునతో కింగ్‌, వెంకటేష్‌తో న‌మో వెంక‌టేశ సోసోగా ఆడాయి. 2011లో మ‌హేష్‌తో శ్రీ‌నువైట్ల తీసిన దూకుడు ఇం డ‌స్ట్రీ హిట్ అయ్యింది. ఎన్‌టీఆర్‌తో బాద్‌షా, యావ‌రేజ్‌గా నిలిచింది. త‌ర్వాత మ‌హేష్‌తో తీసిన ఆగ‌డు, రామ్‌చ‌ర‌ణ్‌తో బ్రూస్‌లీ ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. వ‌రుణ్‌తేజ్‌తో తీసిన మిస్ట‌ర్‌ బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. మ‌ళ్లీ త‌న మొద‌టి సినిమా హీరో ర‌వితేజ‌తోనే సినిమా చేయాలనే ఆలోచ‌న‌తో ఉన్నాడు శ్రీ‌ను. 

 

వేణు హీరోగా వ‌చ్చిన స్వ‌యంవ‌రం సినిమాతో మాట‌ల ర‌చ‌యిత‌గా ప‌రిచ‌య‌మైన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, త‌రుణ్ హీరోగా వ‌చ్చిన `నువ్వే నువ్వే`తో ద‌ర్శ‌కుడిగా మారాడు. త‌ర్వాత మ‌హేష్‌తో చేసిన‌ అత‌డు సూప‌ర్‌హిట్‌. వెంట‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో జ‌ల్సా తీశాడు. అది కూడా ఇండ‌స్ట్రీ హిట్‌. రెండేళ్లు క‌ష్ట‌ప‌డి మ‌హేష్‌తో `ఖ‌లేజా` చేసినా ఆశించిన ఫ‌లితం రాలేదు. త‌ర్వాత అల్లుఅర్జున్‌తో `జులాయి`, ప‌వ‌న్‌తో `అత్తారింటికి దారేది సినిమాల‌తో వ‌రుస హిట్లు కొట్టాడు. మ‌ళ్లీ అల్లు అర్జున్‌తో సన్నాఫ్ స‌త్య‌మూర్తి, నితిన్‌తో చేసిన అ..ఆ  మంచి విజ‌యం సాధించాయి. రెండు విజ‌యాలు ఇచ్చిన ప‌వ‌న్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వచ్చిన అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాలో అస‌లు త్రివిక్ర‌మ్ మార్క్ క‌నిపించ‌లేద‌ని అభిమానుల నిరాశ‌ప‌డ్డారు. ఇప్పుడు ఎన్‌టీఆర్‌తో సినిమా చేసే ప‌నిలో ఉన్నాడు త్రివిక్ర‌మ్‌.

 

వి.వి. వినాయ‌క్ ఆ పేరే ఒక సెన్సెష‌న్‌. ఆది సినిమాతో ఎన్టీఆర్‌కి మాస్‌ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాడు వినాయ‌క్‌. త‌ర్వాత దిల్‌, చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమాల‌తో ఇండ‌స్ట్రీలో సెటిల్ అయిపోయాడు. ఇక ఠాగూర్‌తో ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాశాడు. త‌ర్వాత సాంబ‌, బ‌న్నీ, లక్ష్మి, యోగి, కృష్ణ‌, బద్రీనాథ్ తో అల‌రించినా.. ఎన్టీఆర్‌తో తీసిన అదుర్స్ సూప‌ర్ హిట్ అయింది. త‌ర్వాత నాయ‌క్ కూడా మంచి విజ‌యం సాధించింది. బెల్లంకొండ శ్రీ‌నివాస్‌ని ప‌రిచ‌యం చేస్తూ చేసిన అల్లుడు శ్రీ‌ను, అక్కినేని అఖిల్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ చేసిన అఖిల్‌ తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. ఇక చిరు వెల్‌క‌మ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150తో మ‌ళ్లీ త‌న మ్యాజిక్ నిరూపించాడు వినాయ‌క్‌. మెగా అల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో తీసిన‌ ఇంటెలిజెంట్ నిరాశ‌ప‌రిచింది. ఇప్పుడు మ‌రోసారి అదుర్స్‌-2 తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డాడు. తామేంటో మరోసారి నిరూపించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అందులో ఎంత‌వ‌ర‌కూ స‌క్సెస్ అవుతారో వేచిచూడాల్సిందే!!

 

ఒక్క హిట్టు కోసం ప‌రితపిస్తున్న ముగ్గురు డైరెక్ట‌ర్లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share