తుస్సుమ‌న్న ట్రైల‌ర్‌..సునీల్ ఖాతాలో మ‌రో రొట్ట సినిమా..?

ఒకే ఒక్క హిట్టు కోసం నానా ఆప‌సోపాలు ప‌డిపోతున్నాడు క‌మెడియ‌న్ కం హీరో సునీల్‌. నాలుగైదు వ‌రుస ప్లాపుల‌తో విల‌విల్లాడుతోన్న సునీల్ ప‌రిస్థితి ఇప్పుడు బాగా దిగ‌జారిపోయింది. అయినా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా సునీల్ మాత్రం హీరోగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు. ఉంగ‌రాల రాంబాబు పేరుతో సునీల్ ఒక సినిమా చేస్తున్నాడ‌న్న విష‌యం మ‌న‌కు చాలా రోజులుగా తెలుసు. ఇబ్బందుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు లోప‌లే మ‌గ్గిపోతోన్న ఈ సినిమా ట్రైల‌ర్ ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యింది.

ట్రైల‌ర్ చూస్తేనే ఇది చాలా పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డి, రొటీన్ రొడ్డ‌కొట్టుడు సినిమా అని అర్థ‌మైపోతోంది. ఈ సినిమాపై ముందుగా కూడా ఎవ్వ‌రికి న‌మ్మ‌కాలు లేవు. సునీల్ గురించి అస్స‌లు లేక‌పోయినా డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ కావ‌డంతో ఎక్క‌డో చిన్న‌పాటి న‌మ్మ‌కం ఉంది. ట్రైల‌ర్‌లో ఒక్క డైలాగూ పేల‌లేదు, ఒక్క షాట్ కూడా పండ‌లేదు.

టైటిల్‌కు త‌గ్గ‌ట్టే సునీల్ చేతినిండా ఉంగ‌రాలు, త‌ల‌నిండా జుట్టు, రంగు రంగుల డ్రెస్సుల‌తో క‌న‌ప‌డుతున్నాడు. రొటీన్ కామెడీ, రొట్ట స్టోరీతోనే ఉంగ‌రాల రాంబాబును చుట్టేశారా అన్న సందేహాలు ట్రైల‌ర్‌లోనే వ‌చ్చేస్తున్నాయి. సినిమాను ఫంక్తు క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లో తీసేసినా ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందా ? అన్న ప్ర‌శ్న వేసుకోక త‌ప్ప‌దు.

ఇక ట్రైల‌ర్ చివ‌ర్లో ప్ర‌కాశ్‌రాజ్ హీరోయిన్ మియాజార్జ్‌తో అస‌లు ఎలా న‌చ్చాడ‌మ్మా ? వీడు నీకు అంటాడు. ఈ డైలాగ్ విన్నాక సునీల్‌ను అస‌లు నీకు ఈ సినిమాలో ఏం న‌చ్చింది ? అన్న ప్ర‌శ్న వేయాల‌నిపించ‌క మాన‌దు. ట్రైల‌ర్ అయితే త‌స్సుమంది. మ‌రి సినిమా సునీల్‌ను గ‌ట్టెక్కిస్తుందా ? చూద్దాం.