ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు పార్టిసిపెంట్స్ క‌రువు

ప్ర‌స్తుతం బుల్లితెర రంగంలో దేశ‌వ్యాప్తంగా బిగ్ బాస్ షోకు ఎంతో క్రేజ్ ఉంది. ఇప్ప‌టికే నార్త్‌లో ఓ ఊపు ఊపేసిన ఈ షో ఇప్పుడు తెలుగు బుల్లితెర మీద సంచ‌ల‌నాలు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా రెడీ అవుతోన్న ఈ షో ఇక్క‌డ ఎన్ని కాంట్ర‌వ‌ర్సీలు క్రియేట్ చేస్తుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోను ఉంది. స‌హ‌జంగానే బిగ్ బాస్ షో అంటే కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్‌. ఇప్పుడు ఇది తెలుగు జ‌నాల‌ను ఎంత వ‌ర‌కు ఎంట‌ర్‌టైనింగ్ చేస్తుంద‌న్న‌ది ఆస‌క్తిగాను, స‌స్పెన్స్‌గాను ఉంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ ఎంపిక ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఇందులో ఎక్కువ మంది సెల‌బ్రిటీల‌నే ఎంపిక చేస్తారు. ఈ క్ర‌మంలోనే పలువురికి ఆహ్వానాలు కూడా అందుతున్నాయట. ఆహ్వానాలు అందుకున్న చాలా మంది ఈ షోలో పాల్గొనేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం నిర్వాహ‌కుల‌కు షాక్ ఇస్తోంద‌ట‌.

పార్టిసిపెంట్స్‌లో భాగంగా ఓ సీనియ‌ర్ హీరో కుమార్తెకు ఇన్విటేష‌న్ అంద‌గా ఆ హీరో త‌న కుమార్తెకు వ‌చ్చిన ఇన్విటేష‌న్‌ను రిజెక్ట్ చేశాడ‌ట‌. ఇక ఓ టాలీవుడ్ డైరెక్ట‌ర్ కుమార్తె హీరోయిన్ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆమె సైతం ఆహ్వానం అందుకున్నా..ఆమె తండ్రి, స‌ద‌రు డైరెక్ట‌ర్ మాత్రం ఈ షోలో పాల్గోవ‌ద్ద‌ని ఆమెకు చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఈ షోలో బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అయ్యిందంటే అందుకు హాట్ భామ‌లు అయిన స‌న్నీలియోన్ – రాకీ సావంత్ – త‌నీషా ముఖ‌ర్జీ లాంటి వాళ్లు చేసిన ర‌చ్చే మెయిన్ రీజ‌న్‌. అక్క‌డ ఇచ్చే టాస్క్‌ల దెబ్బ‌తో వాళ్లు నానా గొడ‌వ‌లు చేసి షోకు క్రేజ్ తీసుకువ‌చ్చారు. అయితే ఇప్పుడు ఈ షోలో పాల్గొనేందుకు టాలీవుడ్ స్టార్స్ ఎవ్వ‌రూ ఒప్పుకోవడం లేదు స‌రిక‌దా..? వారి వార‌సుల‌ను సైతం షోకు దూరంగా ఉంచుతున్నార‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

అయితే నిన్న‌టి వ‌ర‌కు ఒక‌టో రెండో ఛాన్సుల‌తో హీరోయిన్లుగా రాణించి ఫేడ‌వుట్ అయిన చిన్న చిన్న హీరోయిన్లు, ముదురు హీరోయిన్లు మాత్రం బిగ్ బాస్ షో నుంచి ఆహ్వానం ఎప్పుడు అందుతుందా ? అని వెయిట్ చేస్తున్నారట‌.