టాలీవుడ్‌లో సీక్వెల్స్ సినిమాల‌ చీటింగ్‌

సినిమా అంటే.. స‌మాజంపై పెను ప్ర‌భావం చూపించే ప్ర‌ధాన మాధ్య‌మం. ఇప్పుడు ఎన్ని సాంకేతిక మాధ్య‌మాలు ఉర్రూత‌లూగుతున్నా.. సినిమా ప్ర‌భావం ఎటూ క‌ద‌ల‌కుండా అలానే ఉంది. ఇప్ప‌టికీ జ‌నాల నోటి వెంట సినిమా డైలాగులు ఆసువుగా వ‌చ్చేస్తున్నాయంటే.. మూవీ మ్యాజిక్ అంతా ఇంతా అని చెప్ప‌లేం. అయితే, రానురాను మూవీలు జ‌నాలను చీటింగ్ చేస్తున్నాయ‌నే టాక్ వ‌స్తోంది. ఇట‌వ‌ల కాలంలో సీక్వెల్ పేరుతో వ‌స్తున్న మూవీల‌కు కొద‌వ ఉండ‌డం లేదు. అగ్ర హీరో నుంచి చిన్నా చిత‌కా హీరోల వ‌ర‌కు ఈ పిచ్చి ముదిరిపోయింది. తాజాగా విడుద‌లైన ప‌లు సీక్వెల్ మూవీలు అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాయి. దీనికి కార‌ణం ఏంట‌ని ఆలోచిస్తే.. ఆ సినిమాలో కొంచెం.. ఈ సినిమాలో కొంచెం.. గుదిగుచ్చి.. తీస్తుండ‌డ‌మేన‌ని అంటున్నారు సినీ విశ్లేష‌కులు.

రీసెంట్ డిజాస్ట‌ర్ల‌లో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కిక్ 2 లాంటి సినిమాలు అలాంటి బ్యాడ్ రిజ‌ల్ట్ అందుకోవ‌డానికి కార‌ణం “చెప్పేది ఒక‌టి చేసేది ఇంకోటి“ అవ్వ‌డ‌మేన‌న్న‌ది ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల విశ్లేష‌ణ‌. ఆర్య త‌ర్వాత తీసిన ఆర్య 2 సైతం అస‌లు కొన‌సాగింపు క‌థ కాక‌పోవ‌డం, కేవ‌లం ఏవో కొన్ని పాత్ర‌ల‌కు మొద‌టి భాగంలోని పాత్ర‌ల ల‌క్ష‌ణాల్ని ఆపాదించి పూర్తిగా కొత్త క‌థ‌తో, కొత్త న‌టుల‌తో తెర‌కెక్కించ‌డం వ‌ల్ల ద‌క్కిన బ్యాడ్ రిజ‌ల్ట్ అని విశ్లేషిస్తున్నారు. రైట‌ర్ ట‌ర్న్‌డ్ డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ, సుకుమార్ వంటి వాళ్లే ఈ మాట‌ను అంగీక‌రిస్తున్నారు.

మొద‌టి భాగం క‌థ‌తో ఏమాత్రం సంబంధం లేకుండా పార్ట్ 2ని తెర‌కెక్కిస్తున్నారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. కేవ‌లం ఏవో కొన్ని పాత్ర‌ల పేర్ల‌ను, స్వ‌భావాల్ని మాత్ర‌మే సీక్వెల్ క‌థ‌ల్లో ఉప‌యోగించుకుంటూ మొత్తం సినిమా క‌థ‌ను న‌చ్చిన‌ట్టు రాసుకుంటున్నారు. అంతేకాదు.. కొన్ని క‌థ‌లు ఏవేవో రాసుకుని, వాటికి అప్ప‌టికే హిట్ట‌యిన సినిమా టైటిల్‌ని వాడేస్తున్నారు. అప్ప‌ట్లో బిజినెస్‌మేన్ పార్ట్ 2 కోసం క‌థ రాసుకున్నాడు వ‌క్కంతం. కానీ టెంప‌ర్‌గా ఎన్టీఆర్‌తో తీశారు అదే సినిమా. అయితే ఎన్టీఆర్ వ‌చ్చేస‌రికి అది క‌థ కాస్తా ఏదో అయ్యింది. టెంప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డం మాట అటుంచితే.. ఒక్కోసారి ఇలాంటివి జ‌రుగుతున్నాయని తెలిసింది.

ప్ర‌స్తుతం శంక‌ర్ తీస్తున్న రోబో 2 సీక్వెల్ కానేకాద‌ని శంక‌ర్ చెప్పేశాడు కాబ‌ట్టి ఫ‌ర్వాలేదు కానీ, సీక్వెల్ అంటే మ‌ళ్లీ దాని లెక్క వేరు. ఇక‌ముందు తీయ‌బోయే భార‌తీయుడు సీక్వెల్ క‌థ కూడా ప్రేక్ష‌కాభిమానుల ఊహ‌కంద‌ని విధంగా ఉంటే ఫ‌లితం ఊహించేదే. సో.. ఏదేమైనా.. సీక్వెల్ పేరుతో కొత్త సినిమాలు తీస్తున్నా.. వాటిలో `ప‌స‌` లేకుండా తీస్తుండ‌డంతో అవి ఫెయిల్ అవుతున్నాయ‌న‌డంలో సందేహం లేదు. మ‌రి ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఎప్ప‌టికి మార‌తారో చూడాలి.