
భూమిపై దెయ్యాలు ఉన్నాయా..?లేవా? అన్నదానికి ఇప్పటి వరకు ఎవరూ సరైన సమాధానాలు మాత్రం చెప్పలేక పోయారు. అంతే కాదు దెయ్యాలున్నాయని తెలిస్తే..అటు వైపు వెళ్తే చనిపోతామని భయం ప్రతి ఒక్కరిలో ఇప్పటికీ ఉంది. దేవుడిని ఎంతగా భక్తితో కొలుస్తారో..దెయ్యాలంటే అంతగా వణికిపోతుంటారు. ఇక దేవుడన్నా..దెయ్యాలన్నా..చదువుకున్న వారు సైతం ప్రభావితం అవుతుంటారు. తాజాగా వరంగల్ లో డేరింగ్ అండ్ డాషింగ్ కలెక్టర్..ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలి దెయ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆమ్రపాలి.. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్. ఆమె ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. టాక్ ఆఫ్ ద టౌన్. అందమే కాదు.. అద్భుతమైన పనితీరు ఆమె సొంతం. పారిశుద్ద్య కార్మికులకు సినిమా టిక్కెట్లు బుక్ చేసినా.. కొండలపై ట్రెక్కింగ్ చేసినా.. అందరినీ ఆశ్చర్యపర్చింది.
చరిత్రకు సజీవసాక్ష్యంగా నిలుస్తున్న ఓరుగల్లులో కలెక్టర్ బంగ్లా ఇది. చెట్లు, చేమలతో చుట్టూ పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ బిల్డింగ్ చూసేందుకు ఆహ్లాదకరంగా సుందరంగా కనిపిస్తుంది. పగటిపూట చూడ్డానికి అదిరిపోయే లొకేషన్లా కనిపిస్తుంది. కానీ చీకట్లు కమ్ముకున్నాయంటే చాలు ఇక్కడికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. 133 యేళ్ల క్రితం సూపర్ ఇంటెండెంట్ ఇంజనీర్‌గా జార్జ్ పామర్ ఉన్న సమయంలో ఆయన భార్య ఈ భవనానికి శంకుస్థాపన చేశారట. అయితే, ఈ మధ్య కొత్త కలెక్టరేట్‌కు పునాది రాయి వేసే సమయంలో ఆ భవనం చరిత్ర తెలుసుకున్నానని కలెక్టర్ అమ్రపాలి చెబుతున్నారు. జార్జ్ పామర్ ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి తనలో కలిగిందన్నారు.
దీంతో పరిశోధన చేయగా జార్జ్ పామర్ గొప్ప ఇంజినీర్ అని తెలిసిందన్నారు. అతడి భార్యే ఈ భవనానికి శంకుస్థాపన చేశారన్నారు. గతంలో ఈ భవనంలో పనిచేసిన కలెక్టర్లు ఇందులోని మొదటి అంతస్తులో దెయ్యం ఉందని తనతో చెప్పారని ఆమ్రపాలి పేర్కొన్నారు. అక్కడ మాత్రం తనకు పడుకోవాలంటే చచ్చేంత భయం వేసిందని..అందుకే ఆ గదిలోకి వెళ్లాలనే సాహసం చేయలేక పోయానని నవ్వూతూ అన్నారు. తాజాగా ఈ విషయాన్ని సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాస్తిక్ రాకేష్ ఒక ప్రకటనలో ఖండించారు.
జిల్లా మెజిస్ట్రేట్ అయిన వ్యక్తులు సాధారణ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యే విషయాలపై స్పందించేపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ముఖ్యంగా ప్రజలు ఎంతో సున్నితాంశంగా భావించే దెయ్యలు, భూతాలు, మంత్రాలు..క్షుద్రశక్తులు ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పని అయితే కలెక్టర్ ఆర్టికిల్ 51 ఏ (హెచ్) అనుసరించి అక్కడ విజ్ఞానాన్ని నెలకొల్పి అజ్ఞానాన్ని తరిమేయాల్సిన బాధ్యత ఉందన్నారు. చాలా మంది అధికారులు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మవొద్దని స్మాశానాల్లో పడుకుని ప్రజలకు ధైర్యం చెబుతుంటారని..అవకాశం ఇస్తే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బృందం కలెక్టర్ నివాసంలోని మొదటి అంతస్తులో దెయ్యం లేదని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.