గ్రూప్ -2 ప‌రీక్ష‌ల్లో నిజామాబాద్ హ‌వా…. ఎంపీ క‌విత‌పై లుకలుకలు

తెలంగాణ గ్రూప్‌-ఈ ప‌రీక్ష‌ల్లో నిజామాబాద్ జిల్లా అభ్య‌ర్థులు పెద్ద సంఖ్య‌లో ఇంట‌ర్వ్యూల‌కు ఎంపిక కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపై ప‌రీక్ష‌రాసిన అభ్య‌ర్థులు ఇప్ప‌టికే ప‌లు ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తుండ‌గా తాజాగా ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల నుంచి కూడా ఇదే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అభ్య‌ర్థులే ఎక్కువుగా ఎంపిక కావ‌డంపై తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయ‌ని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్‌ ఆరోపించారు.

ఈ వ్య‌వ‌హారంలో సీఎం కేసీఆర్ కుటుంబంపై అనుమానాలు ఉన్నాయ‌న్న మ‌హేష్ క‌విత‌కు సంబంధం ఉంద‌ని ఆరోపించారు. గ్రూప్‌-2 ప‌రీక్ష‌కు సంబంధించి కొన్ని సెంట‌ర్ల‌లోనే వ‌రుస నెంబ‌ర్ల‌తో ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు పాస్ కావ‌డంపై ఆయ‌న ప‌లు సందేహాలు వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌ మూడేళ్ల పాలన చూస్తే ప్యాకేజీ, లీకేజీలు తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదనీ మ‌హేష్ విమర్శించారు.

ఇక ఈ విమ‌ర్శ‌లు ఇలా ఉంటే ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల సందేహాల‌కు లెక్కేలేదు. గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల్లో వైట్‌న‌ర్ వాడ‌కంపై నిషేధం ఉన్నా కొంద‌రు వాడ‌గా…వారి షీట్లు కూడా వాల్యూ చేశారు. ఇప్పుడు వైట్‌న‌ర్ వాడిన వారు కూడా పాస్ అవ్వ‌డం చూస్తుంటే ఇక్క‌డ చాలా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ అనుమానాలు ఇలా ఉండ‌గానే ఇప్పుడు నిజామాబాద్ నుంచే ఎక్కువ మంది ఎంపిక కావ‌డం వెన‌క ఎంపీ క‌విత హ‌స్తం ఉంద‌ని వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు గ్రూప్‌-2 ప‌రీక్ష పార‌ద‌ర్శ‌క‌త‌పై చాలా సందేహ‌ ప్ర‌శ్న‌లే లేవ‌నెత్తుతున్నాయి.