కాకినాడపై ముద్రగడ ప్రభావం ఎంత? 

August 26, 2017 at 7:39 am
mudragada padmanabham

తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌లోని 48 వార్డుల‌కు ఈ నెల 29న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత జరుగుతున్న ఈ ఎన్నిక‌ల‌పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా త‌మ‌ది అభివృద్ధి అజెండా అని ప‌దే ప‌దే చెబుతున్న టీడీపీ , సీఎం చంద్ర‌బాబు, లేదు రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని గ‌ర్జిస్తున్న వైసీపీ, దాని అధినేత జ‌గ‌న్‌కు ఈ ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. మ‌రోప‌క్క‌, ఇదే జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, మాజీ మంత్రి, కాపు ఉద్య‌మ‌నే త ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్ర‌భావంపైనా ఇప్పుడు ఇక్కడ చ‌ర్చ సాగుతోంది.

కాపులను బీసీల్లో చేర్చుతామనే హామీతో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. మూడేళ్ల‌యినా ఇప్ప‌టికీ ఆహామీని నెర‌వేర్చ‌క‌పోవ‌డంపై ముద్ర‌గ‌డ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ డిమాండ్‌తో ఇటీవ‌ల‌ ఆయన చేపట్టిన ‘చలో అమరావతి’ పాదయాత్రను పోలీసులు దాదాపు నెలరోజులుగా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ కిర్లంపూడిలో వందలాదిమంది పోలీసులను మోహ‌రించి.. అక్క‌డే ఉంచింది. దీంతో ఇప్ప‌టికీ.. ముద్ర‌గ‌డ పాద‌యాత్ర అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. మ‌రోప‌క్క‌, ఆయ‌న చంద్ర‌బాబును తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు కూడా.

మ‌ధ్యాహ్నం పూట ఇంటి బ‌య‌ట‌కు వ‌చ్చి కాపుల ఆక‌లి కేక‌లు అమ‌రావ‌తికి వినిపించేలా కంచాల‌పై గ‌రిటెల‌తో కొట్టాలంటూ ఆయ‌న ఇచ్చిన పిలుపు పూర్తిగా అమ‌ల‌వుతోంది. కిర్లంపూడితోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ప్ర‌భావం ఇప్పుడు మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న కాకినాడ ఎన్నిక‌ల‌పై ప‌డుతుందా? అనే కోణంలో అంద‌రూ ఆలోచిస్తున్నారు. కాకినాడ‌లో కాపు వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డంతోఈ ఎన్నిక‌లో ముద్ర‌గ‌డ తన ప్ర‌భావం ఎంత మేర‌కు చూపిస్తార‌నే విష‌యంపై సర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. వైసీపీ అయితే, ముద్ర‌గ‌డ ప్ర‌భ‌వంతో టీడీపీ ఓట్ల‌న్నీ త‌మ‌కే వాలిపోతాయ‌ని అంచ‌నాలు వేస్తోంది.

అయితే, టీడీపీ మాత్రం గెలుపు త‌మ‌దే అనే ధీమా వ్య‌క్తం చేస్తోంది. కాపుల‌కు అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని, కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు స‌హా విదేశీ విద్యారుణాలుఅందిస్తున్నామ‌ని, కాపుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తున్నామ‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే మంజునాథ క‌మిష‌న్ రిపోర్టు వ‌స్తే.. తాము పూర్తిగా కాపుల‌కు అవ‌సర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా హామీ ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో కాపులంతా త‌మ‌తో నే ఉన్నార‌ని, ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఉద్యమం ఉత్తుత్తిదేన‌ని విమ‌ర్శిస్తోంది.

ఈ క్ర‌మంలోనే టీడీపీ కాపు వ‌ర్గానికే చెందిన బ‌ల‌మైన నేత హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌ను రంగంలోకి దించింది. ఈయ‌న రోడ్డురోడ్డుకు వెళ్లి.. వీధి వీధిలోని ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుస్తూ.. కార్పొరేష‌న్ ఎన్నికే అయినా.. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ప్ర‌చారం ముమ్మ‌రం చేస్తున్నారు. ముద్ర‌గ‌డ ముద్ర క‌నిపించ కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీంతో ఇక్క‌డ దాదాపు ముద్ర‌గ‌డ ప్ర‌భావం ఎంత మాత్ర‌మూ ఉండ‌ద‌నేది టీడీపీ భావ‌న‌.

అయితే, వైసీపీ మాత్రం దీనికి భిన్నంగా అంచ‌నాలు వేస్తోంది. కాపులు సైలెంట్ గా ఉన్న‌ప్ప‌టికీ… ఎన్నిక‌ల స‌మ‌యానికి భిన్నంగా స్పందిస్తార‌ని అంటోంది.

గ‌త ఫ‌లితాలు చూస్తే..

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన వెనుకబడిన తరగతులకు చెందిన వనమాడి వెంకటేశ్వరరావు గెలుపులో ముద్రగడకు చెందిన సామాజిక తరగతివారే కీలకంగా వ్యవహరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థులకు ఏకపక్షంగా ఆ సామాజిక తరగతి మద్దతు పునరావృతమవడం సాధ్యమయ్యేది కాదని విశ్లేషకుల భావన. కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో ముద్రగడ సామాజిక తరగతికి చెందిన నేతలు టీడీపీ వైసీపీల్లో కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ఈ నెల 29న జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో 2,36,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 45 వేల మంది కాపు సామాజిక తరగతికి చెందినవారుకాగా 41 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

కాకినాడపై ముద్రగడ ప్రభావం ఎంత? 
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts