కాకినాడ‌లో టీడీపీ గెలుపున‌కు ముద్ర‌గడ ఇలా హెల్ఫ్ చేశారా…

ఏపీలో వారం రోజులు తిర‌క్కుండానే అధికార టీడీపీకి రెండో గుడ్ న్యూస్‌. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన టీడీపీ ఈ రోజు కాకినాడ‌లో జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లోను స‌త్తా చాటింది. నంద్యాల‌లోలాగానే కాకినాడ‌లోను వార్ వ‌న్‌సైడ్ అయిపోయింది. నంద్యాల‌లో సానుభూతి సెంటిమెంట్ బాగా ప‌నిచేసింద‌ని, మంత్రులంతా అక్క‌డే దిగిపోయార‌ని, చంద్ర‌బాబు ఏకంగా రూ.1200 కోట్లు రిలీజ్ చేశార‌ని, అధికార దుర్వినియోగం జ‌రిగిపోయింద‌ని జ‌గ‌న్ గ‌గ్గోలు పెట్టారు.

స‌రే జ‌గ‌న్ చెప్పిన దాంట్లో కూడా కాస్త వాస్త‌వం ఉంది కాబ‌ట్టి నంద్యాల వ‌ర‌కు టీడీపీ గెల‌వ‌డం ఓకే అనుకున్నా…కాకినాడ రిజ‌ల్ట్ మాత్రం జ‌గ‌న్‌, వైసీపీ అభిమానులు జీర్ణించుకోలేని విధంగా వ‌చ్చింది. 48 డివిజ‌న్ల‌లో వైసీపీకి కేవ‌లం 10 డివిజ‌న్లు అంటే అది ఘోర అవ‌మాన‌మే. కాపు ఉద్య‌మం ఎఫెక్ట్ ఎక్కువుగా ఉండ‌డంతో పాటు ముద్ర‌గ‌డ తెర‌వెన‌క కాస్తో కూస్తో వైసీపీకి హెల్ప్ చేశాడ‌న్న వార్త‌లు వ‌చ్చాయి. దీంతో అధికార టీడీపీకి యాంటీగా ఇది త‌మ‌కు బాగా వ‌ర్క్ అవుట్ అవుతుంద‌ని జ‌గ‌న్ ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ ఫ‌లితం రివ‌ర్స్ అయ్యి జ‌గ‌న్‌కు దిమ్మ‌తిరిగేలా వ‌చ్చింది.

ముద్ర‌గ‌డ వైసీపీకి మైన‌స్ అయ్యాడా..!

కాపు ఉద్య‌మాన్ని త‌ల‌కెత్తుకున్న ముద్ర‌గ‌డ ఒకేసారి ఉవ్వెత్తున ఎగిసిప‌డిన అగ్నిలా పైకిలేవ‌డం ఆ వెంట‌నే చ‌ల్ల‌బ‌డిపోవ‌డం చేస్తున్నారు. త‌మ జాతి అయిన కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ప్ర‌స్తావించాల్సిన ఆయ‌న ప‌దే ప‌దే చంద్ర‌బాబును, టీడీపీని టార్గెట్ చేయ‌డంతో ఆయ‌న‌లోని జాతి కోసం పోరాటం క‌న్నా రాజ‌కీయ ఆరాటం ఎక్కువైంద‌న్న‌ది అంద‌రికి తెలిసిపోయింది.

ముద్ర‌గ‌డ ఇక్క‌డ కాపుల‌ను టీడీపీకి యాంటీగా రెచ్చ‌గొడుతూ వ‌చ్చారు. వాళ్లంతా టీడీపీకి యాంటీగా ఓట్లు వేసేలా ఆయ‌న మోటివేట్ చేశార‌ట కూడా. అయితే ఇది బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంతో ఇక్క‌డ కాపుల‌తో పాటు స‌మానంగా ఉన్న మ‌త్స్య‌కారుల‌తో పాటు బీసీల్లో బ‌ల‌మైన శెట్టిబ‌లిజ‌, వైశ్యులంతా టీడీపీకే ఓటేశారు. అయితే కాపు ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారని భావించారు. అయితే శుక్ర‌వారం రిజ‌ల్ట్ చూస్తే ముద్రగడ ప్రభావం పెద్దగా కన్పించ లేదని తెలుస్తోంది. కాపు ఓటర్లు బలంగా ఉన్న వార్డుల్లోనూ టీడీపీ జెండా ఎగురడం ఇందుకు కారణం.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే త‌మ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని బీసీ వ‌ర్గాలు టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేస్తే, కాపులు ముద్ర‌గ‌డ కంటే బాబునే న‌మ్మార‌ని అర్థ‌మ‌వుతోంది. కాపుల‌కు చంద్ర‌బాబు ఇప్ప‌టికే కార్పొరేష‌న్ ఏర్పాటు చేశారు. ఇక రిజ‌ర్వేష‌న్ల అంశంలోను న్యాయం చేస్తాన‌ని చెప్పారు. దీంతో వాళ్లు చంద్ర‌బాబుకే జై కొట్టారు.

ఓవ‌రాల్‌గా కాకినాడలో ముద్రగడ ప్రభావం తీవ్రంగా ఉంటుందనుకున్న విశ్లేషకులకు సైతం ఓటర్లు షాక్ ఇచ్చారు. ముద్ర‌గ‌డ సైలెంట్‌గా ఉన్న ఇక్క‌డ వైసీపీకి కాసిన్ని ఓట్లు ప‌డేవేమో ? అని ఇప్పుడు వైసీపీ వాళ్లు నిట్టూరుస్తున్నారు.