ముద్ర‌గ‌డ ముద్ర చెరిగిపోతుందా?!

అవును! కాపు స‌మాజాన్ని త‌న జాతి అంటూ భుజాల మీద‌కి ఎక్కించుకున్న నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. కాపు జాతి కోసం ఆయ‌న ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌ని నేత‌గా ఇటీవ‌ల కాలంలో భారీగా గుర్తింపు పొందారు. మా కంటూ ఓ నేత ఉన్నాడు అని కాపులు చెప్పుకొనేలా ముద్ర‌గ‌డ ఎదిగిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు కాపు జాతికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాన‌ని ఇచ్చిన హామీని అమ‌లు చేయాల‌ని ప‌దే ప‌దే డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే అధికారం చేప‌ట్టి మూడేళ్లు గ‌డిచి పోయాయ‌ని, మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు సిద్ధం అవుతున్నామ‌ని మ‌రి ఇంకెప్ప‌డు హామీ నెర‌వేరుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబుపై పోరుబాట‌కు సిద్ధ‌మ‌య్యారు ముద్ర‌గ‌డ‌. ఇప్ప‌టికే అనేక విధాలుగా త‌న పోరును సాగించిన ఆయ‌న తాజాగా పాద‌యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, శాంతి భ‌ద్ర‌తల పేరుతో ప్ర‌భుత్వం ఈ యాత్ర‌ను ముందుకు సాగ‌నివ్వ‌డం లేదు. అంతేకాదు, ఆయ‌ను ఇంటి నుంచి కూడా బ‌య‌ట‌కు రానీయ‌కుండా నిబంధ‌న‌ల కొర‌డా ఝ‌ళిపిస్తోంది. ఇది ఒక భాగం అయితే, తాజాగా నిన్న విజ‌య‌వాడ‌లో కాపులు నిర్వ‌హించిన స‌మావేశంలో ముద్ర‌గ‌డ‌ను కాపుల నుంచి వేరు చేసేలా.. కాపుల‌తో ఆయ‌న‌కున్న సంబంధాన్ని పూర్తిగా దెబ్బ‌తీసేలా, కాపుల‌పై ముద్ర‌గ‌డ ముద్ర‌ను పూర్తిగా చెరిపివేసేలా కొన్ని నిర్ణ‌యాలు వెలువ‌డ్డాయి.

దీంతో ఈ రాజ‌కీయాల‌కు వెనుక ఉన్న‌ది ఎవ‌రు? అనే ప్ర‌శ్న ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ముద్ర‌గడ ముద్ర‌ను చెరిపివేస్తోంది ఎవ‌రు? అని ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ముఖ్యంగా కాపు లంతా టీడీపీకి వ్య‌తిరేక‌మై పోయార‌ని అనుకుంటున్న త‌రుణంలో ముద్ర‌గ‌డ ఇమేజ్‌కి డ్యామేజీ చేస్తూ.. కాపులంతా టీడీపీతోనే ఉన్నార‌ని, టీడీపీ ప్ర‌భుత్వ‌మే కాపుల‌కు మేలు చేస్తుంద‌ని, టీడీపీ లేక‌పోతే.. కాపుల‌కు ఏమీ జ‌ర‌గ‌ద‌ని, టీడీపీ అంటే కాపులు… కాపులంటే టీడీపీ అనేలా ప‌రిస్థితిని పూర్తిగా మార్చేసింది ఎవరు? ఇప్పుడు ఇదే అంద‌రినీ వేధిస్తున్న ప్ర‌శ్న‌.

దీనికి ఒకే ఒక్క వ్య‌క్తి స‌మాధానంగా క‌నిపిస్తున్నారు. ఆయ‌నే తూర్పుగోదావ‌రికి చెందిన హోం మంత్రి, డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప‌. చంద్ర‌బాబు చేర‌దీసి డిప్యూటీ సీఎంను చేసినందుకు ఆయ‌న త‌న‌వంతు రుణంగా కాపుల ప‌క్షాన టీడీపీపై మ‌చ్చ‌ప‌డ‌కుండా చూసుకుంటున్నాడు. ముఖ్యంగా ముద్ర‌గ‌డ‌ను ఏకేయ‌డంలో చిన‌రాజ‌ప్ప ఫ‌స్ట్ ఉంటున్నారు. ఆది నుంచి ముద్ర‌గ‌డ‌ను విమ‌ర్శించ‌డం స‌హా.. ఆయ‌నేమ‌న్నా కాపుల మొత్తానికి ప్ర‌తినిధా? అంటూ విరుచుకుప‌డుతున్నారు. ఇక‌, ఇక్క‌డే ఇంకో విష‌యం లేవ‌నెత్తాలి.

అధికార టీడీపీని ఇరుకున ప‌డేసే.. రాజ్య‌ధికార రిజ‌ర్వేష‌న్‌లు కాపుల‌కు అవ‌స‌రం లేద‌ని కొత్త నినాదాన్ని కూడా చిన‌రాజ‌ప్పే సృష్టించారు. నిజానికి రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్ లేన‌ప్పుడు మిగిలిన రిజ‌ర్వేష‌న్లు ఉండి సాధించేది ఏమిటి? అయితే, వాటి జోలికి వెళ్తే.. బీసీలు టీడీపీకి దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. ప్ర‌స్తుతం నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌లు కాచుకుని ఉన్న నేప‌థ్యంలో బీసీల‌ను మ‌క్కువ చేసుకునేందుకు చిన‌రాజ‌ప్ప ఈ హైడ్రామాకు తెర‌దీసి.. ఓ రెండు వేల మంది త‌న అనుచ‌ర కాపు వ‌ర్గంతో జై కొట్టించేశాడు. మ‌రి అంత‌టితో కాపులు ఊరుకుంటారో? లేక రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్ కావాల‌ని ఉద్య‌మిస్తారో చూడాలి.