బాలయ్య ఎమ్మెల్యేగా గ్రాఫ్ ఎలా వుంది..2019లో గెలుస్తాడా?

తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వం కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఏపీలోని అనంత‌పురం జిల్లా హిందూపూర్ వ‌జ్ర‌పుకోట‌. పార్టీ పెట్టిన ఈ మూడున్న‌ర ద‌శాబ్దాల్లో ఇక్క‌డ పార్టీ ఒక్క‌సారిగా కూడా ఓడిపోలేదు. క‌ర్ణాట‌క‌కు స‌రిహ‌ద్దుల్లో ఉండే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో హిందూపూర్ పుర‌పాల‌క సంఘంతో పాటు మండ‌లం, చిల‌మ‌త్తూరు, లేపాక్షి మండ‌లాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట‌ర్లు 2.16 ల‌క్ష‌లు. ఇక్క‌డ మైనార్టీలు, బీసీల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. 1952లో ఆవిర్భ‌వించిన ఈ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం గురించి మాట్లాడుకోవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు ఆ త‌ర్వాత అని చెప్పుకోవాలి.

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ఇక్క‌డ నుంచి 1985, 1989, 1994ల‌లో వ‌రుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆ త‌ర్వాత 1996 ఉప ఎన్నిక‌ల్లో హ‌రికృష్ణ గెలిస్తే, 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రో కుమారుడు బాల‌కృష్ణ గెలిచారు. ఇలా ఎన్టీఆర్‌, ఆయ‌న ఇద్ద‌రు త‌న‌యుల‌ను ఎమ్మెల్యేల‌ను చేసిన ఘ‌న‌త హిందూపూర్‌కు ద‌క్కుతుంది. ఈ కంచుకోట‌లో గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బాల‌కృష్ణ అటు న‌ట‌న‌ను, ఇటు నియోజ‌క‌వ‌ర్గాన్ని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ నియోజ‌క‌వర్గాన్ని ఎలా డ‌వ‌లప్ చేస్తున్నారు ? ఆయ‌న ప్ల‌స్‌లు, మైన‌స్‌ల లెక్కేంటో ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో చూద్దాం.

అభివృద్ధి ఎలా ఉంది…. స‌మ‌స్య‌లు ఏంటి…

బాల‌య్య ఎమ్మెల్యేగా గెలిచిన ఈ మూడేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గానికి కోట్లాది రూపాయ‌లు మంజూరు చేయించాడు. ఏపీలోని అన్ని శాఖ‌ల మంత్రుల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి కూడా నిధుల మంజూరుకు ఆయ‌న ప్ర‌ణాళిక‌లు వేశారు. వ‌రుస‌గా సినిమాలు చేస్తుండ‌డంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో లేక‌పోయినా ఇన్‌చార్జ్ ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ మూడేళ్ల‌లో హిందూపురానికి ప‌లు విద్యా సంస్థ‌లు మంజూర‌య్యాయి. నియోజ‌క‌వ‌ర్గంలో చాలా గ్రామాల్లో కోట్లాది రూపాయ‌ల‌తో అంత‌ర్గ‌త రోడ్లు వేశారు.

ఇక గొల్ల‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ నుంచి హిందూపూర్ ప‌ట్ట‌ణానికి నీరందించే ప్రాజెక్టుకు బాల‌య్య రూ.193 కోట్లు మంజూరు చేయించారు. ఇక బైపాస్ రోడ్డుతో పాటు జిల్లాలో ఏ హాస్ప‌ట‌ల్లో లేన‌ట్టుగా 12 ప‌డ‌క‌ల‌తో డ‌యాల‌సిస్ సెంట‌ర్ ఏర్పాటు చేయించారు. హంద్రీనీవా ద్వారా నియోజ‌క‌వ‌ర్గానికి నీరందించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన స‌మ‌స్య తాగు, సాగునీటి స‌మ‌స్య‌. ఈ స‌మ‌స్య గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా అలాగే ఉంది. నియోజ‌క‌వ‌ర్గం అంతా ఈ స‌మ‌స్య ఉన్నా హిందూపూర్ ప‌ట్ట‌ణంలో మ‌రింత ఎక్కువుగా ఉంది. ట్యాంక‌ర్ల‌తో నీటిని ఎంత పంపిణీ చేస్తున్నాఅవి స‌రిపోవ‌డం లేదు. ఇక్క‌డ బిందె మంచినీరు రూ.4 నుంచి రూ.7 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ప‌ట్ట‌ణానికి నీరు స‌ర‌ఫ‌రా చేసే గొల్ల‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ ప‌థ‌కం పూర్త‌యితే ఈ కొర‌త తీరుతుంది.

విప‌క్ష నాయ‌కులు మాత్రం బాల‌య్య‌ను ఎన్నో అంచ‌నాల‌తో గెలిపిస్తే ఆశించిన మేర అభివృద్ధి జ‌ర‌గ‌లేదంటున్నారు. గొల్ల‌ప‌ల్లి నుంచి హిందూపూర్‌కు నీరు తెప్పించాకే మాట్లాడాల‌ని వారు చెపుతున్నారు. తాగునీరు, హౌసింగ్ స‌మ‌స్య‌ల హామీ ఏమైంద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

రాజ‌కీయంగా ఎలా ఉందంటే…

రాజ‌కీయంగా హిందూపూర్ ఇప్ప‌ట‌కీ జ‌నాలు నంద‌మూరిపురంగా పిలుస్తుంటారు. పార్టీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు పార్టీ క్యాడ‌ర్ అస్స‌లు ఏ మాత్రం చెక్కుచెద‌ర్లేదు. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి తండ్రి, ఇద్ద‌రు కొడుకుల విజ‌యాలతో పార్టీ దూసుకుపోతోంది. ఇక ప్ర‌తిప‌క్షాలు ఇక్క‌డ అస్స‌లు ప్ర‌భావం చూప‌డం లేదు. వైసీపీ నుంచి ఇన్‌చార్జ్‌గా ఉన్న న‌వీన్‌నిశ్చ‌ల్ అంత స‌మర్థుడైన నేత కాక‌పోవ‌డం టీడీపీకి బాగా క‌లిసిరానుంది. ఆయ‌నకు సొంత పార్టీ క్యాడ‌ర్‌పైనే ప‌ట్టులేదు. ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవ‌డం వేస్ట్‌.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– నియోజ‌క‌వ‌ర్గానికి కోట్లాది రూపాయ‌ల మంజూరు

– కొన్ని కీల‌క ప్రాజెక్టులు పూర్త‌వ్వ‌డం

– చ‌రిత్ర‌లో నిలిచేలా లేపాక్షి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌

– బ‌ల‌హీన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు

– నంద‌మూరి ఫ్యామిలీకి కంచుకోట‌లాంటి నియోజ‌క‌వ‌ర్గం

మైన‌స్ పాయింట్స్‌(-):

– స్థానికంగా అందుబాటులో ఉండ‌రని కొంద‌రి ఆరోప‌ణ‌

– గ్రూపు రాజ‌కీయాలు

– ప్ర‌ధాన‌మైన తాగునీటి స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డం

బాల‌య్య‌పై టాక్ ఎలా ఉంది….

బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నా అభివృద్ధి ప‌నుల‌కు భారీగా డ‌బ్బులు మంజూరు చేయించ‌డం, కొన్ని ప‌నులు అభివృద్ధి జ‌ర‌గ‌డం వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు సంతోషంగానే ఉన్నారు. అయితే నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌మైన తాగు, సాగునీటి స‌మ‌స్య‌ను పూర్తిగా ప‌రిష్క‌రిస్తేనే ఆయ‌నపై తాము పెట్టుకున్న అంచ‌నాలు రీచ్ అయిన‌ట్టుఅని చెపుతున్నారు. ఇక ఈ యేడాదిన్న‌ర‌లో గొల్ల‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ కంప్లీట్ చేసి హిందూపూర్‌కు నీరు తెప్పిస్తే బాల‌య్య‌కు తిరుగు ఉండ‌దు.