నంద్యాల రాజ‌కీయం ట్విస్టులే ట్విస్టులు

ఉప ఎన్నిక‌ల వేళ క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం రోజు రోజుకు ఎటు మ‌లుపులు తిరుగుతుందో అంచ‌నా వేయ‌డం క‌ష్టంగా మారుతోంది. ఇక నంద్యాల రాజ‌కీయం బాగా హీటెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం ఇక్క‌డ టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలో చేర‌గా ఇప్పుడు అదే బాట‌లో మ‌రో కీల‌క వ్య‌క్తి ప‌య‌నిస్తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

దివంగ‌త నేత భూమా నాగిరెడ్డికి నంద్యాల‌లో కుడిభుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో వైసీపీ నేత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని… ఆయన ఏ క్షణమైనా పార్టీని వీడే అవకాశముందని తెలుస్తోంది. మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారశైలిపై ఆయ‌న ఇటీవ‌ల ఓపెన్‌గానే త‌న తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే ఆయ‌న అసంతృప్తిని ప‌సిగ‌ట్టిన అధిష్టానం ఆయ‌న్ను బుజ్జ‌గించింది. సీఎం చంద్ర‌బాబే ఏకంగా రంగంలోకి దిగి పార్టీలో కొన‌సాగితే మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని స‌ర్దిచెప్పారు.

చంద్ర‌బాబు నంద్యాల ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న్ను నేరుగా పిలిపించుకుని మాట్లాడారు. బుజ్జ‌గింపులు ఎలా ఉన్నా అఖిల‌ప్రియ ఏవీని ప‌క్క‌న పెట్ట‌డాన్ని ఆయ‌న స‌హించ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై వైసీపీ వల వేసిన‌ట్టు తెలుస్తోంది. ఉప ఎన్నిక‌ల‌కు ముందు త‌మ పార్టీలోకి వ‌స్తే తాము ఫ్యూచ‌ర్‌లో ఎమ్మెల్సీ ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక భూమా వైసీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచి ఏవీతో స‌న్నిహిత సంబంధాలు ఉన్న వైసీపీ నేత‌లు ఆయ‌న్ను త‌మ పార్టీలోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేశార‌ట‌. అయితే త‌న‌కు బ‌ల‌మైన హామీ ఇస్తే తాను పార్టీ మారేందుకు రెడీగా ఉన్నాన‌న్న సంకేతాలు ఏవీ పంపిన‌ట్టు తెలుస్తోంది. దీంతో జిల్లా వైసీపీ సీనియ‌ర్లు ఆయ‌న్ను పార్టీలోకి తీసుకెళ్లేందుకు అప్పుడే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేసిన‌ట్టు తెలుస్తోంది.