ఆ ఓట్లు ఎవ‌రివైపు ఉంటే వారిదే నంద్యాల‌

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్ధిగా శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. గత ఎన్నికలను పరిశీలిస్తే… అప్పటి వైసీపీ అభ్యర్ధి భూమా నాగిరెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కేవలం రెండు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. దీంతో ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనే గణాంకాలు అప్పుడే నంద్యాలలో మొదలయ్యాయి.

గత ఎన్నికల్లోనూ టీడీపీ, వైసీపీ హోరా హోరీగా పోటీ పడ్డాయి. అయితే ఇద్దరికీ వ్యక్తిగత బలం ఉండటంతో వైసీపీ విజయాన్ని చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు మ‌ళ్లీ వ‌స్తాయ‌ని వైసీపీ నాయ‌కులు ధీమాగా ఉన్నారు. భూమా కుటుంబం టీడీపీలోకి వెళ్లినా.. క్యాడ‌ర్ అంతా త‌మ వైపే ఉంద‌ని చెబుతున్నారు. టీడీపీ పై తీవ్ర అసంతృప్తి ప్ర‌జ‌ల్లో ఉంద‌ని, ఈ ఎన్నిక‌ల్లో అది బ‌య‌ట‌ప‌డుతుంద‌ని వివ‌రిస్తున్నారు. కేవలం అమరావతికే అభివృద్ధిని పరిమితం చేసి రాయలసీమను విస్మరించారన్న అపవాదును ఏపీ సర్కార్ ఎదురుకుంటోంద‌ని చెబుతున్నారు. అంతకు ముందు నంద్యాల వైపే చూడని చంద్రబాబు.. ఇప్పుడు చేస్తున్న హ‌డావుడిన ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారని.. వీటన్నింటినీ గుర్తించి ప్ర‌జ‌లు త‌మ‌కే విజ‌యం క‌ట్ట‌బెడ‌తార‌ని స్ప‌ష్టంచేస్తున్నారు.

ఇక టీడీపీ.. సెంటిమెంట్ పైనే ఎక్కువ ఆధారపడిఉంది. నియోజకవర్గంలో దాదాపు రూ.1200కోట్ల‌ విలువైన పనులను మంజూరు చేసింది. దీంతో పాటు భూమా నాగిరెడ్డి అకాల మరణం నుంచి ఇంకా ప్రజలు తేరుకోలేదని, అది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. శిల్పా పార్టీని వీడటం కూడా తమకు లాభిస్తుంద‌ని చెబుతున్నారు. నంద్యాల అభ్యర్థిగా పోటీ చేసే ముందు దాదాపు పదేళ్లు దూరంగా ఉన్నా.. అప్పుడే అండగా నిలిచినప్పుడు ఈ ఎన్నికల్లో భూమా కుటుంబా నికే నంద్యాల ఓటర్లు మ‌ద్ద‌తుగా ఉంటార‌ని టీడీపీ అభిప్రాయ‌ప‌డుతోంది. దీంతో పాటు ఆ రెండు వేల ఓట్లు కూడా కీల‌కంగా మార‌నుంది. మొత్తానికి నంద్యాల ఉప ఎన్నిక సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌లపిస్తోంద‌న‌డంలో సందేహం లేదు!