నంద్యాల‌లో నైతిక గెలుపు జ‌గ‌న్‌దేనా?

అవును! మేధావులు సైతం ఇప్పుడు ఇదే స‌బ్జెక్ట్‌పై చ‌ర్చిస్తున్నారు. నంద్యాల‌లో వైసీపీ ఓడిపోయింది. ఇది టెక్నిక‌ల్‌గా ఏ ఒక్క‌రూ త‌ప్పు ప‌ట్ట‌లేని విష‌యం. అయితే, జ‌గ‌న్ గెలిచాడు!! తెర‌వెనుక దీనిని కూడా త‌ప్పుప‌ట్ట‌లేని వాస్త‌వం! ఈ విష‌యంపై వైసీపీ నేత‌ల్లోనే కాదు, స్వ‌యంగా నంద్యాల టీడీపీ త‌మ్ముళ్ల‌లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. ఎక్క‌డ ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసినా.. న‌లుగురు గుమి గూడినా.. జ‌గ‌న్‌పై అభినంద‌న‌ల జ‌ల్లు కురుస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు! ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. వారు చెబుతున్న విష‌యాల‌తో ఏకీభ‌వించ‌క త‌ప్ప‌దు.

2014లో నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాన్ని వైసీపీ కైవ‌సం చేసుకుంది. దీంతో చంద్ర‌బాబు ఈ నియోజ‌క‌వ‌ర్గంపై తీవ్ర అక్క‌సు పెంచుకున్నారు. క‌నీసం నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి నిధులు కూడా ఇవ్వ‌రా? అంటూ భూమా నాగిరెడ్డి 2015లో అసెంబ్లీ సాక్షిగా బాబును నిల‌దీశారు. దీనికి అధికార ప‌క్షం నుంచి ఎలాంటి స‌మాధాన‌మూ లేదు. ప‌రిస్థితులు మారాయి. 2016లో భూమా బాబు సైకిల్ ఎక్కేశారు. మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించారు. అంతేకాదు, నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు తిరుగులేకుండా చేసుకోవాలంటే.. నిధులు సైతం కావాలి కాబ‌ట్టి బాబు పంచ‌న చేర‌క త‌ప్ప‌ద‌ని నిర్ణ‌యించుకుని జంప్ చేశారు.

ఇంత‌లోనే ఆయ‌న హ‌ఠాత్తుగా మ‌ర‌ణించారు. దీంతో ఉప పోరు అనివార్య‌మైంది. ఇక‌, ఇక్క‌డ ఏక‌గ్రీవం చేద్దామ‌నుకున్న బాబు వ్యూహం బెడిసి కొట్ట‌డంతో జ‌గ‌న్‌పై కారాలు మిరియాలు నూరుతూనే అభివృద్ధి మంత్రం దిశ‌గా బాబు అడుగులు వేశారు. మ‌రో వారం ప‌దిరోజుల్లో ఎన్నిక‌ల కోడ్ వెలువ‌డ నుంద‌న‌గా.. అప్ప‌టిక‌ప్పుడు అర్ధ‌రాత్రి వేళ 1200 కోట్ల రూపాయ‌లు నంద్యాల‌కు మంజూరు చేశారు. కొన్ని ద‌శాబ్దాలుగా స‌మ‌స్య‌గా ఉన్న నంద్యాల ప్ర‌ధాన రోడ్డు విస్త‌ర‌ణ‌కు అర్ధ‌రాత్రే ఆదేశాలు వెళ్లాయి.

అంతే, తెల‌తెల వారుతుండ‌గానే రోడ్ల ప‌క్క‌న ఉన్న దుకాణాలు తొలిగిపోయాయి. రోడ్డు విస్త‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన బిల్డింగులు ప‌గిలిపోయాయి. మంత్రులు నేరుగా వీధివీధినా తిరిగారు. దోమ‌ల మందులు ద‌గ్గ‌రుండి మ‌రీ చ‌ల్లించారు. చిన్న‌పాటి స‌మ‌స్య‌లు ఎదురైనా స్పందించారు. సీసీరోడ్లు వేయించారు. పింఛ‌న్లు అంద‌ని వారిని గుర్తించి మ‌రీ పింఛ‌న్లు ఇప్పించారు. దీంతో నంద్యాల స్వ‌రూపం ఒక్క‌సారిగా మారిపోయింది. అభివృద్ధి కి అంద‌నంత దూరంగా ఉన్న గ్రామాల్లోనూ అభివృద్ధి పొద్దు పొడిచింది. దీనంత‌టికీ కార‌ణం ఏంటి? బాబా జ‌గ‌నా? అంటే.. అంద‌రి వేళ్లూ.. జ‌గ‌న్‌వైపే చూపుతున్నాయి.

జ‌గ‌న్ ఇక్క‌డి నుంచి పోటీ పెట్ట‌క‌పోయి ఉంటే, ఏక‌గ్రీవం చేసి ఉంటే.. బాబు ఎప్ప‌టికీ ప‌ట్టించుకునేవాడు కాద‌ని, అభివృద్ధికి నంద్యాల అంద‌నంత దూరంలోనే ఉండిపోయేద‌ని టాక్ న‌డుస్తుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. మ‌రి ఆయ‌న‌కు ఓటెందుకు వేయ‌లేదు? అంటే.. ప్ర‌స్తుతానికి వేసినా.. ఉప‌యోగం లేదు క‌దా! అనే మ‌రో ఆస‌క్తిక‌ర స‌మాధానం జ‌నం నుంచే రావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్తిగా ఉన్న శిల్పా మోహ‌న్‌రెడ్డికి 70 వేల ఓట్లు వ‌చ్చాయంటే.. వైసీపీపై అభిమానం ఉందో లేదో మీరు చెప్పాల‌ని జ‌నాలు మ‌న‌కే ప‌రీక్ష పెడుతున్నారు. అయితే, కొస‌మెరుపు ఏంటంటే.. జ‌గ‌న్ కొంచెం ఆలోచ‌నా యుతంగా వ్య‌వ‌హ‌రించి ఉంటే.. విజ‌యం కైవ‌సం అయ్యేదేన‌ని మ‌రికొంద‌రి సూచ‌న‌. ఏదేమైనా.. నంద్యాలలో జ‌గ‌న్ టెక్నిక‌ల్‌గా ఓడినా.. నైతికంగా గెలిచాడు!!