నంద్యాల వేడెక్కింది… బాబు-జ‌గ‌న్‌-బాల‌య్య‌-ప‌వ‌న్‌

నంద్యాల‌లో ఎన్నిక‌లకు తేదీ ద‌గ్గ‌ర‌పుడుత‌న్న కొద్దీ.. ప్ర‌తి ఒక్క‌రిలో ఉత్కంఠ పెరుగుతోంది. ప్ర‌చారానికి ముగింపు ప‌లికేందుకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌కొస్తున్న స‌మ‌యంలో.. అగ్ర నేత‌లు ప్ర‌చారంలోకి దిగ‌బోతున్నారు. ఇప్ప‌టికే వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్.. నంద్యాల‌లోనే మ‌కాం వేశారు. ఇక టీడీపీ నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అక్క‌డే ఉంటున్నారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా రంగంలోకి దిగ‌బోతున్నారు. ఆయ‌న‌తో పాటు సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఒక‌వైపు.. చివ‌రి రెండు రోజులు ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత కూడా త‌న మ‌ద్ద‌తు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ట‌. దీంతో నంద్యాల సమరం హీటెక్క‌డం ఖాయం!!

అటు టీడీపీ, ఇటు వైసీపీ ఉప ఎన్నిక గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో వ్యూహప్రతివ్యూహాలతో రాజకీయం ర‌స‌త‌వ్త‌రంగా మారింది. విమర్శలు, ప్రతి విమర్శలతో నంద్యాల‌ రగులుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికార పక్షంపై పైచేయి సాధించాలని వైసీపీ అధినేత‌ జగన్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. నంద్యాలను దక్కించుకోవడం ద్వారా వైసీపీ ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీయాలని టీడీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. నంద్యాల సీటును గెలుచుకోవడం ద్వారా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీని మానసికంగా దెబ్బకొట్టాలని నిర్ణయించింది. ఫలితంగా ప్రచారంలో ఇరు పార్టీలు దూసుకుపోతున్నాయి.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏకంగా నంద్యాలలోనే తిష్టవేశారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసిన జగన్ ఇప్పుడు నంద్యాలపై దృష్టి కేంద్రీకరించారు. విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు గోస్పాడు మండలంపై వైసీపీ, టీడీపీలు ప్రధానంగా దృష్టి సారించాయి. గత ఎన్నికల్లో ఈ మండలంలో వైసీపీకి ఎక్కువ ఓట్లు రావడంతో అది తమకు అనుకూలమని వైసీపీ భావిస్తోంది. అయితే ఈసారి ఆ మండలంలో పైచేయి సాధించాలని భావిస్తున్న టీడీపీ నేతలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నంద్యాల సీటుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించిన టీడీపీ.. ప్రచారంలో జనాకర్షక నాయకులను రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ రాబోతున్నారు. ఈ క్రమంలో బుధవారం నుంచి ఆయన నంద్యాలలోనే ప్రచారం చేయనున్నారు. రోడ్‌షోలు, పాదయాత్రలు నిర్వహించనున్నారు. ఇక టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక రోజు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక జ‌న‌సేనాని కూడా టీడీపీకి మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తార‌ని తెలుస్తోంది. చివ‌రి రెండు రోజులు, ఎల‌క్ష‌న్ స‌మ‌యానికి ఆయ‌న అందుబాటులోకి వ‌స్తార‌ని స‌మాచారం! నంద్యాల హీట్ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రింత పెరిగే అవ‌కాశాలున్నాయి.