జ‌గ‌న్‌కి అస‌లు సిస‌లు ప‌రీక్ష స్టార్ట్‌!

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార పార్టీలో చిచ్చు పెడితే.. ఇప్పుడు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష పార్టీలో సొంత నేత‌ల నుంచే అసంతృప్తి మంట‌లు రాజుకుంటున్నాయి. భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో వ‌చ్చిన ఈ ఉప ఎన్నిక.. ఇప్పుడు జ‌గ‌న్‌కి అన్ని విధాలా అగ్ని ప‌రీక్ష‌గా మారింది. ఇక్క‌డ వైసీపీకి ఇన్‌చార్జ్‌గా ఉన్న రాజ్‌గోపాల్‌రెడ్డి.. ఈ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా ఆయ‌న‌కు హామీ ఇచ్చాడు.

అయితే, ఇంత‌లోనే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పొలిటిక‌ల్ అంచ‌నాలు మారిపోయాయి. అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న శిల్పా మోహ‌న‌రెడ్డి… సీటు త‌న‌కు కేటాయించ‌లేద‌ని టీడీపీ సైకిల్‌నుంచి జంప్ చేసి వైసీపీలోకి చేరిపోయాడు. కేవ‌లం ఆయ‌న ఈ సీటు కోస‌మే జ‌గ‌న్ పంచ‌న చేరాడ‌ని అప్ప‌ట్లోనే విశ్లేష‌కులు తేల్చి పారేశారు. అయితే, అదేం లేద‌ని అప్ప‌ట్లో శిల్పా ప్ర‌క‌టించాడు. ఇక‌, నిన్న జ‌గ‌న్‌.. నంద్యాల ఉప ఎన్నిక‌కు శిల్పాను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేశాడు.

దీంతో ఇప్పుడు అస‌లు సిస‌లు యుద్దం వైసీపీలోనే రాజుకుంది. సీటు త‌న‌కు కేటాయిస్తార‌ని భావించిన రాజ‌గోపాల్ రెడ్డి లోలోన ఉడికి పోతున్నాడు. వైసీపీ కి రిజైన్ చెసి సైకిలెక్క‌డ‌మా? లేక వైసీపీలోనే ఉంటూ.. టీడీపీ అభ్య‌ర్థికి ఓట్లు ప‌డేలా చేసి క‌సి తీర్చుకోవ‌డ‌మా అనే విష‌యంపై మ‌ద‌న ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ఇందులో ఏది జ‌రిగినా జ‌గ‌న్‌కి దెబ్బే. ఇక‌, ఇదే సీటును ఆశించిన మ‌రో వైసీపీ నేత మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప్‌రెడ్డి సైతం ఇప్పుడు శిల్పాకు ఎంత వ‌ర‌కు స‌పోర్ట్ చేస్తార‌న్న‌దానిపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వాస్త‌వానికి ఈ ఉప ఎన్నిక అటు అధికార టీడీపీకి, ఇటు వైసీపీకి మ‌ధ్య ప్ర‌తిష్ట‌కు సంబంధించిన ఇష్యూగా మారిపోయింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు మూడేళ్ల పాల‌న‌కు ఇది రిఫ‌రెండంగా ఇప్ప‌టికే కొంద‌రు తేల్చేశారు. అదేస‌మ‌యంలో నంద్యాల త‌మ సీటేన‌ని, మంత్రి ప‌ద‌వి ఆశ చూపించి భూమాను బాబు బుట్ట‌లో వేసుకున్నాడ‌ని, నీతి లేని రాజ‌కీయాలు చేస్తున్నాడ‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే విమ‌ర్శిస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇక్క‌డి నుంచి మ‌రోసారి గెలిచి.. బాబుపై పైచేయి సాధించాల‌ని చూస్తున్నారు. అయితే, ఇంత‌లోనే పార్టీలో అంత‌ర్గ‌త పోరు ప్రారంభం కావ‌డం జ‌గ‌న్‌కి కంటిపై కునుకులేకుండా చేస్తోంద‌ని టాక్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో రెండు మూడు రోజులు వేచి చూస్తే తెలిసిపోతుంది. మొత్తానికి ఉప ఎన్నిక‌.. అటు బాబుకి, ఇటు జ‌గ‌న్‌కి కూడా పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌నే చెప్పాలి.