అటు అభివృద్ధి.. ఇటు అన్యాయం.. నంద్యాల ఓట‌రు తిక‌మ‌క‌!

నంద్యాల ఉప ఎన్నిక మంచి ఊపుమీదుంది. గ‌తంలో ఎన్నిడూ లేనంత‌గా ఎన్నిక ప్రారంభం అయి రెండు గంట‌లు గ‌డిచాయో లేదో దాదాపు 16% పోలింగ్ న‌మోదైంది. అది కూడా ఓ ఉప ఎన్నిక‌లో కావ‌డంతో ఎన్నిక‌ల సంఘంలో త‌లు పండిన సీనియ‌ర్లు సైతం ఆశ్చ‌ర్య పోతున్నారు. ఇంత వెల్లువ‌లా నంద్యాల ఉప పోరు జ‌రుగుతుంద‌ని వారు అస్స‌లు ఊహించ‌లేదు. ఇంకో మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామం ఏంటంటే.. మంచంలోంచి లేచి తిర‌గ‌లేని ప‌రిస్థితిలో కాటికి కాళ్లు చాపుకున్న వారు సైతం ఈ ఎన్నిక‌లో ఓటు వేసేందుకు వేకువ జామునే బూతుల వ‌ద్ద‌కు రావ‌డం. 

మ‌రోప‌క్క‌, పోలింగ్ బూతులు తెరిచే స‌మ‌యాని క‌న్నా కూడా ముందే ఓట‌ర్లు బూతుల ముందు క్యూలు క‌ట్టేశారు. బాలింతలు, ప‌సిపిల్ల‌ల త‌ల్లులు, విక‌లాంగులు, వృద్ధులు, కురువృద్దులు, ఉద్యోగులు ఇలా ఒక వ‌ర్గం అనే ఏముంది. నంద్యాల స‌మాజంలోని అన్ని వ‌ర్గాల వారూ వెతుక్కుని మ‌రీ పోలింగ్ బూతుల మందు ప్ర‌త్య‌క్ష‌మైపోయారు. దీనిని ప్ర‌జాస్వామ్య వాదులు స్వాగ‌తిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ఇక్క‌డే ఓ విచిత్ర ప‌రిస్థితి ఎదుర‌వుతోంది నంద్యాల ఓట‌ర్‌కి. అదేంటంటే.. ప‌ట్టుమ‌ని మూడేళ్ల‌లో నంద్యాల‌లో చోటు చేసుకున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లే. అప్ప‌ట్లో వ్య‌తిరేకించిన వ్య‌క్తులు.. అప్ప‌ట్లో ఇష్ట‌ప‌డ్డ పార్టీల్లో ప్ర‌త్య‌క్షం కావ‌డమే! అదేవిధంగా అప్ప‌ట్లో ఇష్ట‌ప‌డ్డ వ్య‌క్తులు అప్ప‌ట్లో వ్య‌తిరేకించిన పార్టీల్లో చేరిపోవ‌డం!! 

ఈ ప‌రిణామం నంద్యాల ఓట‌ర్ల‌ను తిక‌మ‌క‌కు మ‌క‌తిక‌కు గురిచేస్తోంది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో భూమా నాగిరెడ్డి వైసీపీలో చేరిపోయారు. అప్ప‌ట్లో ఇదే శిల్పా మోహ‌న్‌రెడ్డి.. టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచారు. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితులు తారుమార‌య్యాయి. అభ్య‌ర్థులు పార్టీల‌ను మార్చేశారు. భూమా వ‌ర్గం మొత్తం క‌ట్ట‌గ‌ట్టుకుని సైకిలెక్కేసింది. శిల్పా గ్యాంగ్ మొత్తం ఫ్యాన్ కింద‌కి చేరిపోయింది. దీంతో ఎవ‌రికి ఓటేయాల‌నే విష‌యంల ఓట‌ర్లు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. అభ్య‌ర్థుల‌ను బ‌ట్టి ఓటేయాలా?  లేక తాము అభిమానించే పార్టీల‌ను బ‌ట్టి ఓటేయా? అన్న‌ది వారికి మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. 

ప్ర‌స్తుత వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి 2014లో ఇదే వైసీపీని తిట్టిపోశాడు. ఇక‌,  2014 ఎన్నిక‌ల్లో టీడీపీని వ్య‌తిరేకించిన వైసీపీ నేత‌లు ఇప్పుడు బాబు వ‌ర్గం. దీంతో ఇప్పుడు వైసీపీకి ఓటెయ్యాలంటే.. జ‌గ‌న్ అభిమానులంతా శిల్పాకి ఓటెయ్యాలి. అంటే, ఇక్క‌డ కూడా అదే సందిగ్ద‌త‌! వైసీపీపై ఉన్న అభిమానాన్ని వ్య‌క్తీక‌రించాలంటే నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ వైరి వ‌ర్గంలో ఉన్న శిల్పాకి ఓటెయ్యాల్సిన ప‌రిస్థితి. ఇక‌, టీడీపీ అభ్య‌ర్థికి ఓటేయాలంటే.. 2014లో త‌మ‌ను తిట్టిపోసిన వారికి ఓటేయాలి. ఇది తెలుగు త‌మ్ముళ్ల‌ను, ఆ వ‌ర్గాన్ని బాధిస్తున్న ప్ర‌ధాన అంశం. ఈ ప‌రిణామం కూడా నంద్యాల రిజ‌ల్ట్‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఓట‌రు నాడి ఎవ‌రికీ అంద‌డం లేదు.  సోమ‌వారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.