టాలీవుడ్లో వరుస హిట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న నేచురల్ స్టార్ నాని తన రేటు పెంచేసినట్టు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఎవడే సుబ్రహ్మణ్యంతో స్టార్ట్ అయిన నాని వరుస విజయాల పరంపర నిన్ను కోరి సినిమాతో ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. ఈ సినిమాతో వరుసగా ఏడో హిట్‌ను సొంతం చేసుకున్న నాని ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో అయిపోయాడు.
నాని సినిమాలు రూ. 30 కోట్ల బిజినెస్ ఈజీగా చేస్తున్నాయి. నేను లోకల్ సినిమాతో బయ్యర్లకు భారీగా లాభాలు తెచ్చిపెట్టిన నాని ఆ సినిమాకు రూ. 5 కోట్లు తీసుకున్నాడట. ఇప్పుడు నిన్ను కోరి సినిమా ఫస్ట్ వీక్‌కే రూ. 30 కోట్ల వసూళ్లకు దగ్గరవుతోంది. దీంతో నాని బిజినెస్ మరింత పెరిగినట్లయ్యింది.
ఈ సినిమాకు మొత్తం పెట్టిన బడ్జెట్ రూ. 18 కోట్ల లోపేనట. ఇక వరుస హిట్లకు తోడు, మార్కెట్ పెరగడం, శాటిలైట్ బిజినెస్ పెరగడంతో నాని తన రేటు పెంచేశాడని తెలుస్తోంది. ఓ స్టార్ హీరో తీసుకునే రెమ్యునరేషన్ నాని డిమాండ్ చేస్తున్నాడట. నిన్నటి వరకు ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లు తీసుకున్న నాని ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.
నాని ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలెక్కించిన నాని, మరో రెండు సినిమాలకు సైతం కమిట్ అయినట్టు తెలుస్తోంది. వరుస హిట్లతో నాని టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.