ఏపీలో అత్తాకోడ‌ళ్ల పోరు ఉంటుందా..!

ఏపీలో ఎన్నికలు ఇంకా కాస్త దూరంలోనే వున్నాయి. మోడీ డెసిష‌న్‌తో 2018లోనే జ‌మిలీ ఎన్నిక‌లు ఉంటాయ‌న్న టాక్ బ‌లంగా వ‌స్తోంది. దీంతో అప్పుడే రాజ‌కీయ వేడి రాజుకుంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో అత్తాకోడ‌ళ్లు అయిన కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి వ‌ర్సెస్ నారా బ్రాహ్మ‌ణి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోరు ఉంటుందా ? అన్న‌దానిపై ఆస‌క్తిక‌ర‌మైన స‌స్పెన్స్ నెల‌కొంది.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌పున బాప‌ట్ల‌, విశాఖ‌ప‌ట్నం నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వ‌రి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరారు. ఆమె కోస్తాలోని కీల‌క జిల్లాలు అయిన కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లో ఎక్క‌డో ఓ చోట ఎంపీగా పోటీ చేయాల‌ని అనుకున్నారు. అయితే ఆమె చివ‌ర‌క్ష‌ణంలో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు కీల‌క‌సీటు ద‌క్క‌పోవ‌డం వెన‌క చంద్ర‌బాబు హ‌స్తం ఉంద‌న్న టాక్ అయితే అప్ప‌ట్లో వ‌చ్చింది.

ఈ క్ర‌మంలోనే ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజంపేట నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. ఈ క్ర‌మంలోనే బీజేపీలో స‌రైన ప్రాధాన్యం లేద‌ని భావిస్తోన్న ఆమె విజ‌య‌వాడ‌పై క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే ఇందుకోసం ఆమె వైసీపీలోకి వెళతార‌ని కూడా జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. విజ‌య‌వాడ సీటుపై ఇప్ప‌టికే రాజ‌కీయం హాట్‌హాట్‌గా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఇక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టీడీపీ టిక్కెట్టు ఇవ్వ‌ద‌ని, టీడీపీ త‌ర‌పున చంద్ర‌బాబు కోడ‌లు బ్రాహ్మ‌ణి పోటీలో ఉంటార‌ని, ఇక వైసీపీ త‌ర‌పున పీవీపీ ఉంటార‌ని ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ ఇంట‌ర్న‌ల్‌గా వినిపిస్తోన్న మరో టాక్ ఏంటంటే పురందేశ్వ‌రి వైసీపీలోకి జంప్ చేసి విజ‌య‌వాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తార‌ని చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. జ‌గ‌న్ సైతం ఆమెకు విజ‌య‌వాడ సీటు ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నాడ‌ట‌.

ఈ నేప‌థ్యంలోనే ఇటు వైసీపీ నుంచి పురందేశ్వ‌రి, టీడీపీ నుంచి నారా బ్రాహ్మ‌ణి పోటీ చేస్తే ఏపీలో విజ‌య‌వాడ ఎంపీ సీటు రాజ‌కీయం రంజుగా ఉంటుంద‌న‌డంలో డౌటే లేదు. ఒక‌వేళ చివ‌రి క్ష‌ణంలో బ్రాహ్మ‌ణి అక్క‌డ బ‌రిలో లేక‌పోతే చంద్ర‌బాబు ఆల్ట్ర‌నేటివ్‌గా రాజ‌గోపాల్‌ను రంగంలోకి దింపే యోచ‌న‌లో కూడా ఉన్న‌ట్టు టాక్‌.