నంద్యాల ప్రచారానికి బ్రాహ్మ‌ణి…తెర వెన‌క క‌థేంది

నంద్యాల ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు ర‌చిస్తోంది. ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్.. ఇలా మొత్తం యంత్రాంగ‌మంతా నంద్యాల‌లోనే మ‌కాం వేశారు. ఈ ఎన్నిక‌ను భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిల‌ప్రియ చాలెంజింగ్‌గా తీసుకున్నారు. త‌న అన్న గెల‌వ‌క‌పోతే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించేశారు. అయితే ఇప్పుడు మ‌హిళా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు స‌రికొత్త ప్ర‌తిపాద న‌ను సీఎం చంద్ర‌బాబు ముందుంచార‌ట‌. అదేంటంటే.. సీఎం కోడ‌లు, మంత్రి నారా లోకేష్ స‌తీమ‌ణి, న‌టుడు బాల‌కృష్ణ కుమార్తె నారా బ్రాహ్మ‌ణితో నంద్యాల‌లో ప్ర‌చారం చేయించాల‌ని అఖిల ప్రియ కోరార‌ట‌.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలిచి తీరాల‌న్న పంతంతో తెలుగుదేశం ఉంది. అందుకే, స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతోంది. నంద్యాలలో ప్ర‌చార భార‌మంతా మంత్రి అఖిల ప్రియ భుజాన వేసుకున్నా, ఆమెకి అండ‌గా నిలుస్తూ పార్టీ వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వ‌చ్చి ప్ర‌చారం చేసి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో పార్టీకి లాభించేలా క‌నిపించే ఏ ఒక్క చిన్న అవ‌కాశాన్ని కూడా జార విడ‌వ‌కూడ‌ద‌నే ప‌ట్టుద‌ల‌తో మంత్రి అఖిల ప్రియ ఉన్నారు. అందుకే, నారా బ్రాహ్మ‌ణితో నంద్యాల‌లో ప్ర‌చారం చేయించాల‌ని అఖిల ప్రియ భావించిన‌ట్టు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

ఈ ప్ర‌తిపాద‌న‌ను ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రికి అఖిల ప్రియ తెలిపిన‌ట్టు స‌మాచారం. నారా బ్రాహ్మ‌ణిని ప్ర‌చారానికి పంపించాల‌నీ, దీంతో పార్టీకి చాలా ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని వివరించార‌ట‌. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో ఉత్సాహం పెరుగుతుంద‌ని, సెంటిమెంట్ కు కూడా కొంత బ‌లం వ‌స్తుంద‌ని సీఎంకు తెలిపిన‌ట్టు చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి కోడ‌లిగా కాక‌పోయినా త‌న స్నేహితురాలిగానైనా ఒక‌సారి ప్ర‌చారానికి వ‌స్తే బాగుంటుంద‌ని ఆమె కోరిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, ముఖ్య‌మంత్రి ఆలోచ‌న మ‌రోలా ఉంద‌ని స‌మాచారం! ఈ ప్ర‌తిపాద‌న‌ను సీఎం సున్నితంగా తోసిపుచ్చార‌ని టీడీపీ వ‌ర్గాలే అంటున్నాయి.

ఈ ఉప ఎన్నిక‌ల్లో బ్రాహ్మ‌ణి ప్ర‌చారానికి దిగితే కొన్ని త‌ప్పుడు సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశాలున్నాయంటూ అఖిల ప్రియ‌కు న‌చ్చ‌జెప్పార‌ని అంటున్నారు. అయితే, ఏదో ఒక‌లా ఒప్పించి, ఆమెను ప్ర‌చారంలోకి తీసుకొస్తే బాగుంటుం ద‌నే అఖిల ప్రియ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. బ్రహ్మ‌ణి రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు అడ‌పాద‌డ‌పా ప్ర‌చారంలోకి వ‌స్తూనే ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆమెని ప్ర‌చారంలోకి దించితే ఆమె ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగిన‌ట్టే. మ‌రి అఖిల‌ప్రియ ప్ర‌తిపాద‌న‌కు సీఎం చంద్ర‌బాబు.. ఒప్పుకుంటారో లేదో!!