టీ-టీడీపీకి టైమ్ ఇవ్వని లోకేశ్

వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ తెలంగాణ‌లో మ‌న పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంది.. త‌మ్ముళ్లూ.. ! అంటూ భ‌రోసా నింపిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఇటీవ‌ల కాలంలో తెలంగాణ టీడీపీ నేత‌ల ముఖం చూడ‌లేదు. ఒక ర‌కంగా టీడీపీ అధినేత ఏపీ అభివృద్ధి, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు వంటి వాటిలో తీరుబ‌డి లేకుండా ఉన్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో టీడీపీని న‌డిపించే బాధ్య‌త‌ను లోకేశ్ భుజాన వేసుకున్నారు. తెలంగాణ నేత‌ల‌తో వారాల త‌ర‌బ‌డి చ‌ర్చించి.. అక్క‌డ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంతోపాటు.. టీడీపీ అభివృద్ధికి వ్యూహాలు సిద్ధం చేశారు.

అయితే, ఇటీవ‌ల కాలంలో లోకేశ్ కేవ‌లం ఏపీకే ప‌రిమిత‌మై పోయార‌ని అనిపిస్తోంది. ముఖ్యంగా ఆయ‌న మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక తెలంగాణ నేత‌ల ముఖం చూడ‌డం కానీ, తెలంగాణ టీడీపీ గురించి మాట్లాడ‌డం కానీ చేయ‌లేదు. మ‌రి ఆయ‌నంత‌ట ఆయ‌నే ఇలా నిర్ణ‌యించుకున్నారా? లేక ఏదైనా వ్యూహాత్మ‌కంగా సీఎం చంద్ర‌బాబే అలా సైలెంట్ అయిపోవాల‌ని లోకేశ్‌కి బోధించారా? అన్న‌ది తెలియాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. తాజా ఉదంతం మాత్రం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మూడు నెల‌ల కింద‌ట తెల్ల‌వారి లేస్తే.. తెలంగాణ టీడీపీ అభివృద్ది గురించి మాట్లాడిన లోకేశ్ .. ఇప్పుడు ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోవ‌డం ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

రీసెంట్ గా జ‌రిగిన ఓ విష‌యాన్ని గ‌మ‌నిస్తే.. మ‌రింత ఆస‌క్తిగా ఉంది. కొందరు తెలంగాణ టీడీపీ నాయకులు విజయవాడ వ‌చ్చి మ‌రీ చంద్రబాబును కలిశారు. తెలంగాణ‌లో టీడీపీని ఎలా డెవ‌ల‌ప్ చేయాలి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిస్థితి ఏంటి? వ‌ంటి కీల‌క అంశాల‌పై వారు చ‌ర్చించారు. వీరిలో ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి, ఎల్‌.ర‌మ‌ణ‌, రావుల చంద్ర‌శేఖ‌ర‌రావు త‌దిత‌రులు ఉన్నారు. అయితే, అదేస‌మ‌యంలో వారు చిన‌బాబును ఎక్క‌డా క‌ల‌వ‌లేదు. క‌నీసం మ‌ర్యాద పూర్వ‌కంగా కూడా భేటీ కాలేదు. దీంతో చంద్రబాబు చెప్పడం వల్లే లోకేశ్‌ తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని సమాచారం. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.