జ‌యంతిని వ‌ర్థంతిగా మార్చేసిన లోకేష్‌

ముందు తెలిసో తెలియ‌కో మాట జార‌డం.. త‌ర్వాత వాటిని స‌రిజేసుకోవ‌డం ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, ఐటీ పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు బాగా అలవాటైపోయింది. మాటల్లో ఆయ‌న తీవ్రంగా త‌డ‌బ‌డుతున్నారు. ఇటీవ‌లే మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం రోజున‌.. అంత‌కుముందు ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఆయ‌న ఇదే విధంగా స్లిప్ అయిన విష‌యం తెలిసిందే! తాజాగా అంబేడ్క‌ర్ జ‌యంతి రోజున కూడా ఆయ‌న మాట జారి న‌వ్వుల‌పాల‌య్యారు.ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న చిన‌బాబు.. త‌న‌ పొర‌పాట్ల‌తో సొంత పార్టీ నేత‌లు ఖంగు తినేలా చేస్తున్నారు.

ఏదైనా కార్యక్రమానికి హాజరయ్యే సమయంలో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాజ‌కీయ నాయ‌కులు తెలుసుకోవాలి. లేక‌పోతే స్టేజ్ మీదే అభాసుపాలవ్వాల్సి వ‌స్తుంది. ఇలాంటి సంఘ‌ట‌నే పాపం చిన‌బాబుకు ఎదురైంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అన్నారు. అయితే పక్కనున్న వారు వెంటనే ఖంగు తిన్నారు. వారంతా వర్ధంతి కాదు.. జయంతి అని చెప్పటంతో నాలుక్కరుచుకున్న లోకేశ్.. సారీ.. జయంతి అని సరిదిద్దుకున్నారు.

లోకేష్ ఇలా త‌డ‌బ‌డ‌టం ఇప్పుడు కొత్తేమీ కాదు. ఏదో మాట్లాడాలన్న తొందరలో తెలియకుండానే సొంత పార్టీ పైనే సైటైర్లు వేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనూ ఆయ‌న‌ ప్రసంగంలో తప్పు దొర్లింది. శ్రద్ధాపూర్వకంగా అనడానికి బదులు శ్రద్ధాంజలి అంటూ తడబడ్డారు. గతంలో టీడీపీ ప్రచార సభల్లోనూ లోకేశ్ టంగ్ స్లిప్పయ్యారు. అలాగే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు శాసనమండలి చైర్మన్ చాంబర్ లోకి వెళుతున్న సందర్భంగా ద్వారం వద్దే తూలి పడబోయిన లోకేష్ పక్కనున్న వారి చేయి పట్టుకుని నిలబడగలిగారు.

వివరాలను తెలుసుకుని బయలుదేరకపోతే ఇలాగే ఉంటుందని అక్కడున్న వారు లోకేశ్ వైపు ఓ టైపులో లుక్కేశారట. మరి చినబాబు తన నాలికను ఎప్పుడు దారిలో పెట్టుకుంటారో చూడాలి. పక్కనున్న వారు చెబితే తప్ప… తాను చేసిన పొరపాటును గుర్తించలేని స్థితిలో ఉన్న లోకేశ్… ఇక కీలక శాఖల మంత్రిగా ఎలా రాణిస్తారన్న వాదన కూడా అప్పుడే మొదలైంది.