అప్పుడు చంద్ర‌బాబు.. ఇప్పుడు లోకేష్ 

టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత నుంచి చంద్ర‌బాబు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే వ‌రకూ ఎన్టీఆర్ కేంద్రంగానే రాజ‌కీయాల‌న్నీ జ‌రిగేవి. ఇక చంద్ర‌బాబు వ‌చ్చాక‌.. పార్టీలో కొత్త ప‌వ‌ర్ సెంట‌ర్ ఏర్ప‌డింది. ఎవ‌రైనా ఆయ‌న ద్వారానే ఎన్టీఆర్‌ను క‌లిసేవారు. ఎన్టీఆర్ హ‌యాం త‌ర్వాత చాలా ఏళ్లు చంద్ర‌బాబు కేంద్రంగానే రాజ‌కీయాలు న‌డిచాయి.. ప్ర‌స్తుతం న‌డుస్తున్నాయి. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడి ఎంట్రీతో మ‌ళ్లీ ఆనాటి రోజులు మ‌ళ్లీ పార్టీలో క‌నిపిస్తున్నాయి. ఇప్పుటి వ‌ర‌కూ తెర వెనుకే ఉన్న నారా లోకేష్‌.. చంద్ర‌బాబు త‌ర్వాత ప‌వ‌ర్ సెంట‌ర్‌గా మారుతున్నారు. పార్టీపై క్ర‌మక్ర‌మంగా ప‌ట్టు సాధించిన ఆయ‌న‌.. ఇప్పుడు క్ర‌మ‌క్ర‌మంగా రాజ‌కీయాలపైనా ప‌ట్టు సాధిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో లోకేష్ శ‌కం ప్రారంభ‌మైంది. మొన్న‌టి వ‌రకూ పార్టీకే ప‌రిమిత‌మైన ఆయన ఇప్పుడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. కీల‌క‌మైన శాఖ‌ల‌కు మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌.. కొద్ది రోజుల్లోనే తానేంటో చూపిస్తున్నారు. కీల‌క‌మైన వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ త‌న మార్క్ చూపించిన ఆయ‌న.. కేబినెట్ లో మంత్రుల శాఖ‌ల‌కు సంబంధించి కూడా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ట‌. ఐఏఎస్‌ అధికారులు కూడా ఆయ‌న్ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు క్యూ క‌డుతున్నారు. చాలా ఏళ్ల త‌ర్వాత టీడీపీలో ప‌వ‌ర్ సెంట‌ర్ పుట్టుకొచ్చింద‌ని పార్టీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి.

తనకు సంబంధం లేకపోయినా సీఆర్డీఏ పరిధిలోని లే అవుట్లకు సంబంధించిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో లోకేష్ పాల్గొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. సీఆర్డీఏ లేఅవుట్ల మంత్రివర్గ ఉప సంఘంలో యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ మంత్రులు ఉన్నా.. లోకేష్ మాటను కాదనలేని పరిస్థితి. ఈ స‌మావేశంలో సీనియర్ మంత్రుల కంటే చాలా చొరవగా నిర్ణయాలను ప్రభావితం చేసేలా వ్యవహరించార‌ట‌. మొన్న‌టి వ‌ర‌కూ ఆయ‌న‌కు సీఎంవోలోని ఉన్నతాధికారులు మినహా మిగిలిన వారితో పెద్దగా పరిచయం లేదు. ఇప్పుడు అధికారికంగా ఐఏఎస్ లతో పరిచయాలకు అడ్డంకి లేకుండా పోయింది. చాలా మంది ఐఏఎస్ లు ఇఫ్పటికే ఆయన చుట్టూ చేరుతున్నార‌ట‌.

కీలకమైన పంచాయతీరాజ్, ఐటీ శాఖలు దక్కించుకున్న ఆయన కేవ‌లం తన శాఖ వ్యవహారాల్లోనే కాకుండా మొత్తం అన్ని శాఖల్లోనూ జోక్యం చేసుకోవటానికి రెడీ అయిపోతున్నార‌ట‌. ఆయ‌న దూకుడు చూసి సీనియ‌ర్ నేత‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌. రాబోయే రోజుల్లో చంద్రబాబు వైపు వెళ్లే వారి కంటే నారా లోకేష్ చుట్టూ తిరిగే వారి సంఖ్య ఎక్కువ‌యినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని పార్టీ నేత వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని మరో నేత వ్యాఖ్యానించారు. మ‌రి భ‌విష్య‌త్తులో చిన‌బాబు ఆధిప‌త్యం పార్టీలో పెరుగుతుంద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.