టీడీపీతో స్నేహ‌`హ‌స్తం` కుదిరిందా?

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దెబ్బ‌కు కాంగ్రెస్‌, టీడీపీ కుదేలైపోయాయ‌. కాంగ్రెస్‌లో అంతోఇంతో చెప్పుకోద‌గ్గ్ నేత‌లు ఉన్నా.. టీడీపీ ప‌రిస్థితి మ‌రీ ఘోరంగా ఉంది. అయితే కాంగ్రెస్‌, టీడీపీ, క‌మ్యూనిస్టులు, ఇలా అన్ని పార్టీలు ఒక తాటిపైకి చేరాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నా.. అది కుద‌ర‌డం లేదు. అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే.. అదే కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించ‌డం. టీఆర్ఎస్‌ను ఓడించ‌డానికి కాంగ్రెస్‌తోనైనా క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌ని.. టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఇన్నాళ్ల‌కు ఈ రెండు పార్టీల మ‌ధ్య స‌యోధ్య కుదిరిన‌ట్టే కనిపిస్తోంది. నేరెళ్ల ఘ‌ట‌న ఈ రెండు పార్టీల‌ను ఒక్క‌టి చేసింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కాంగ్రెస్‌, టీడీపీ.. ఎప్ప‌టినుంచో సీఎం కేసీఆర్‌పై పోరాడుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ పార్టీల‌కు జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్ వంటి వారుకూడా చేరారు. ఇక తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల్లో క‌మ్యూనిస్టుల ప్ర‌భావం కూడా అధికంగానే ఉంది. అయినా వీరంతా ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రి పోరాటం వాళ్లు చేస్తూ వస్తున్నారు. అయితే వీరంతా ఇప్ప‌టి వ‌రకూ క‌లిసి ఉద్య‌మించింది లేదు. ఒక‌వేళ చేసినా..మ‌హాకూట‌మికి అడుగులు ప‌డుతున్నాయ‌నే వార్త‌లు వినిపించాయి. కానీ త‌ర్వాత ఎవ‌రికి వారు సైలెంట్ అయిపోయారు.కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు ప్ర‌త్యామ్నాయ కూట‌మి అవ‌స‌ర‌మ‌ని.. విశ్లేష‌కులు మొదటి నుంచి చెబుతున్న విష‌యం తెలిసిందే!

ఇప్పుడు ప్ర‌త్యామ్నాయ కూట‌మి దిశ‌గా మొద‌టి అడుగు ప‌డింది. కేటీఆర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో దళిత యువకులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన తీరు ఇప్పుడు టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శ‌ల‌కు గురిచేస్తోంది. దీనిపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా విచారణ జరుపుతోంది. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేరెళ్ల సంఘటనపై విపక్షాలన్నీ ఒక్కటిగా నిలిచాయి. కాంగ్రెస్, టీటీడీపీ, క‌మ్యునిస్టులు, బీజేపీ, ప్రజాసంఘాలు అన్నీ కలిసి ఆందోళనకు దిగాయి. నేరెళ్ల సంఘటనపై తొలుత బీజేపీ స్పందించి.. మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిం ది. తర్వాత కాంగ్రెస్ ప్ర‌వేశించింది. మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ను నేరెళ్ల కురప్పించి ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగింది.

గవర్నర్ ను కూడా కాంగ్రెస్ నేత‌లు కలిసి వినతిపత్రాన్ని అందించారు. జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీనేతల ప్రధాన డిమాండ్ గా విన్పిస్తోంది. అయితే నేరెళ్ల సంఘటన వచ్చే ఎన్నికలకు మహాకూటమికి పునాది అని విశ్లేష‌కులు అభిప్రాయ‌డుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు, టీటీడీపీ, తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా ఒక్కతాటిపైకి వచ్చింది. బీజేపీని పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ ఏకమవుతాయని భావిస్తున్నారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను గద్దె దించడానికి కాంగ్రెస్ తోనైనా చేతులు కలుపుతామని ప్రకటించారు.

కేంద్రమాజీ మంత్రి జైపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీని తాము అంటరాని పార్టీగా చూడటం లేదని, టీడీపీతో పొత్తును కొట్టిపారేయలేమంటూ స్పందించ‌డం చూస్తే.. ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరిన‌ట్టేన‌ని తెలుస్తోంది. 2019 ఎన్నికలకు కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు మహా కూటమిని ఏర్పాటు చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం. ఇందులో భాగంగా టీడీపీతో కూడా కలిసే అవకాశాలున్నాయంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు.