ప‌త్తికొండ‌లో యువ రాజకీయం

క‌ర్నూలు జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి అయిన ప‌త్తికొండ రాజ‌కీయం మారుతోంది. తాజాగా వైసీపీ ప‌త్తికొండ ఇన్‌చార్జ్ చెరుకులపాడు నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య త‌ర్వాత ఇక్క‌డ రాజ‌కీయం ఒక్క‌సారిగా హీటెక్కింది. నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య త‌ర్వాత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న భార్య శ్రీదేవికి టిక్కెట్టు ఇస్తాన‌ని, ఆమె ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ప‌త్తికొండ‌లో వైసీపీ త‌ర‌పున కొత్త వ్య‌క్తికి చోటు ఇచ్చిన‌ట్ల‌య్యింది.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం టీడీపీ త‌ర‌పున ఇక్క‌డ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న రాజ‌కీయ కురువృద్ధుడు కేఈ.కృష్ణ‌మూర్తి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే వ‌యస్సు రీత్యా రెవెన్యూ మంత్రిగాను, కీల‌క‌మైన ఉప ముఖ్య‌మంత్రిగాను బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డంలో కేఈ స్పీడ్‌గా ఉండ‌డం లేదు. డోన్‌, ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన రికార్డు ఉన్న ఆయ‌న ఓ సారి క‌ర్నూలు ఎంపీగా కూడా గెలిచారు.

ఈ క్ర‌మంలోనే వ‌య‌స్సు పైబ‌డ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేఈ.కృష్ణ‌మూర్తి పోటీ నుంచి త‌ప్పుకుని త‌న కుమారుడు కేఈ.శ్యాంబాబును రంగంలోకి దించ‌డం దాదాపు ఖ‌రారైంది. ఇప్ప‌టికే శ్యాంబాబు ప‌త్తికొండ‌కు ఇన్‌చార్జ్‌గా అక్క‌డ పార్టీ, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌ను పూర్తిగా చ‌క్క‌పెట్టేస్తున్నాడు. చంద్ర‌బాబు సైతం ఇక్క‌డ వ్య‌వ‌హార‌ల‌న్ని శ్యాంబాబే చూసుకోవాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసేశారు.

దీనిని బ‌ట్టి ప‌త్తికొండ‌లో 2019లో టీడీపీ త‌ర‌పున శ్యాంబాబు అభ్య‌ర్థిత్వం ఖ‌రారైపోయింది. నియోజ‌క‌వ‌ర్గంలో అధికార యంత్రాంగంపై కూడా మంచి గ్రిప్ సాధించిన శ్యాంబాబు నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య‌కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు.

ఇక అటు వైసీపీ నుంచి నారాయ‌ణ‌రెడ్డి భార్య శ్రీదేవి రంగంలో ఉండ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌త్తికొండ‌లో ఇటు టీడీపీ, అటు వైసీపీ నుంచి కొత్త అభ్య‌ర్థులే బ‌రిలో ఉండ‌నున్నారు. మ‌రి వీరిలో గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి.