ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ.. వాళ్ల‌కి న‌చ్చ‌డం లేదా?!

ఏ స్టార్ హీరో అయినా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తే.. వెల్ కం చెప్ప‌ని అభిమానులు ఉండ‌రు. అంతేనా ఆ స్టార్ ఎప్పుడెప్పుడు పాలిటిక్స్‌లోకి వ‌స్తారా? అని ఎదురు చూసే జ‌నాల‌కూ త‌క్కువ‌కాదు. ఏపీలో ఎన్‌టీఆర్‌, త‌మిళ‌నాట ఎంజీఆర్‌లు పార్టీలు పెట్టిన‌ప్పుడు జ‌నాలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఆ త‌ర్వాత చిరంజీవి పార్టీ పెట్టినా యువ‌త, అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. ఇది సినీ స్టార్ల‌కు కామ‌న్‌గానే ప్ర‌జ‌ల నుంచి ద‌క్కే రెస్పెక్ట్‌.

ఇక‌, తాజాగా త‌మిళ‌నాడులో త‌లైవా ర‌జ‌నీ కాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీ విష‌యం ఎన్నాళ్లుగానో తెర‌మీద‌కి వ‌స్తోంది. గ‌త కొన్నాళ్లుగా ఎన్నిక‌లు జ‌రిగిన ప్ర‌తిసారీ ర‌జ‌నీ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అయితే… అప్ప‌ట్లో ఆయ‌న తాను రాజ‌కీయాల్లో రాన‌ని స్ప‌ష్టం చేశారు. కానీ, ఇప్పుడు సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణించ‌డం, రాష్ట్రంలో పొలిటిక‌ల్‌గా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొన‌డంతో ర‌జ‌నీ స్వ‌యంగా పాలిటిక్స్‌లోకి ఎంట‌ర్ కావాల‌ని డిసైడ్ అయ్యారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ర‌జ‌నీ త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు చేసేందుకు స్థానిక‌త పెద్ద అడ్డంకిగా మారింది. వాస్త‌వానికి ర‌జ‌నీ.. మ‌రాఠా వ్య‌క్తి కావ‌డం, త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డ‌డంతో ఆయ‌న‌ను అంగీక‌రించేది లేద‌ని అంటున్నారు త‌మిళులు. అయితే, ఇక్క‌డే ఒక విష‌యాన్ని గ‌మ‌నించాలి. పురుచ్చిత‌లైవిగా పూజ‌లందుకున్న జ‌య‌ల‌లిత కూడా త‌మిళ‌నాడులో పుట్టి పెరిగిన‌వారు కాదు. ఆమె క‌ర్ణాట‌క‌లో పెరిగారు.

ఇక‌, ఇప్పుడు ర‌జ‌నీకి ఇంత యాంటీ వాతావ‌ర‌ణం పెర‌గ‌డం వెనుక కేవ‌లం ఓటు బ్యాంకు రాజ‌కీయాలు త‌ప్ప మ‌రేమీ లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ర‌జ‌నీకి వ్య‌తిరేకంగా కొన్ని పార్టీలు కావాల‌నే ఈ గొడ‌వ‌ల‌ను ఎగ‌దోస్తున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. పొలిటిక‌ల్‌గా ర‌జ‌నీ ఎంట్రీ ఇస్తే.. త‌మ పార్టీ జెండాల‌ను పీకేయాల్సి వ‌స్తుంద‌నే భ‌యంతోనే కొన్ని పార్టీలు ర‌జ‌నీకి వ్య‌తిరేకంగా గొడ‌వ‌లు సృష్టిస్తున్న‌య‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీకి ఇన్ని చిక్క‌లు ఉంటాయ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.