టీటీడీ చైర్మ‌న్ ఆ ఇద్ద‌రిలో ఎవ‌రికో..!

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక దేవాల‌య‌మైన తిరుమ‌ల తిరుప‌తి వెంక‌న్న దేవ‌స్థానం చైర్మ‌న్ ప‌ద‌వి కోసం ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చాలామంది రాజ‌కీయ నాయ‌కులు అయితే ఈ ప‌ద‌విని జీవితంలో ఒక్క‌సారైనా చేప‌ట్టాల‌ని ఎన్నో క‌ల‌లు కంటుంటారు. ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీ నుంచి సీనియ‌ర్ ఎంపీలుగా ఉన్న న‌ర‌సారావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, రాజ‌మండ్రి ఎంపీ మాగంటి ముర‌ళీమోహ‌న్ సైతం గ‌త కొద్ది రోజులుగా ఈ ప‌ద‌వి చేప‌ట్టేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నాలంటూ లేవు.

రాయ‌పాటి అయితే త‌న‌కు టీటీడీ ఇస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎంపీ సీటు కూడా వ‌ద్ద‌ని చెప్పారంటే ఆయ‌న‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విపై ఎలాంటి ఆశ ఉందో తెలుస్తోంది. ఆయ‌న కాంగ్రెస్ ఎంపీగా ఉన్న‌ప్పుడు ఈ ప‌ద‌వి కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చుట్టూ ఎలా ప్ర‌ద‌క్షిణ‌లు చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు చంద్ర‌బాబు చుట్టూ కూడా ఆయ‌న అదే స్థాయిలో ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు.

ఇక మ‌రో సీనియ‌ర్ ఎంపీ మాగంటి ముర‌ళీమోహ‌న్ సైతం టీటీడీ చైర్మ‌న్ పోస్టు కోసం చేయ‌ని ప్ర‌య‌త్నాలంటూ లేవు. అయితే చంద్ర‌బాబు మాత్రం వీరిద్ద‌రికి దిమ్మ‌తిరిగి పోయే షాక్ ఇచ్చారు. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులకు టీటీడీ ఛైర్మన్ పదవిని ఇవ్వాలనుకోవటం లేదని బాబు చెప్ప‌డంతో వీరిద్ద‌రి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్ల‌య్యింది. అయితే ఇప్పుడు ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంది అన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌గా మిగిలింది.

ఈ ప‌ద‌వి కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి ల‌క్ష్మీనారాయ‌ణ‌, టెలికాం రంగ నిపుణులు త్రిపురునేని హనుమాన్ చౌదరి రేసులో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ల‌క్ష్మీనారాయ‌ణ‌కు చంద్ర‌బాబుకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. వీరిద్ద‌రు ఎస్వీ వ‌ర్సిటీలో క‌లిసి చ‌దువుకున్నారు. ఇక హ‌నుమాన్ చౌద‌రి టెలికం రంగంలో చేసిన సేవ‌ల‌కు భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీతో స‌త్క‌రించింది. హ‌నుమాన్ చౌద‌రికి చంద్ర‌బాబుకు కూడా మంచి రిలేష‌న్ ఉంది. దీంతో వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రికి ఈ ప‌ద‌వి ద‌క్కుతుంద‌న్న ఊహాగానాలు ఏపీలో బ‌లంగా వినిపిస్తున్నాయి.