టీఆర్‌ఎస్‌లో క‌ల‌క‌లం.. నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌లు ఔట్‌

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో క్ష‌ణ క్ష‌ణం టెన్ష‌న్ టెన్ష‌న్‌గా మారింది. ఇప్ప‌టికే రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ త‌ర‌ఫున ఇంచార్జ్‌ల‌ను నియ‌మించే ప‌నికి శ్రీకారం చుట్టారు. ఇది బాగానే ఉన్నా.. ఎంచుకున్న విధానంపైనే ఇప్పుడు కిందిస్థాయి నేత‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. అయితే, పార్టీకి బ‌లంగా ఉన్న వ్య‌క్తుల‌కు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించ‌గ‌ల వ్య‌క్తుల‌కు మాత్ర‌మే ఇంచార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కేసీఆర్ డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి.

ముఖ్యంగా ఇత‌ర పార్టీల నుంచి జంప్ చేసి కారెక్కిన 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఇప్పుడు టెన్ష‌న్ తీవ్రంగా ఉంది. వాస్త‌వానికి ఏ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించే ఎమ్మెల్యే ఆ నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జ్‌గా ఉండ‌డం స‌హ‌జం. అయితే, ఎమ్మెల్యేలు గెల‌వ‌ని స్థానాల్లో పార్టీ సీనియ‌ర్ల‌ను ఇన్‌చార్జ్‌లుగా నియ‌మిస్తుంది. ఇప్పుడు తెలంగాణ‌లోనూ అదే జ‌రిగింది. అయితే, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ త‌ర‌ఫున గెలుపొంది కూడా .. టీఆర్ ఎస్ పంచ‌కు చేరుకున్న‌వారు ఉన్నారు. దీంతో ఆయా నియోజ‌క‌ర్గాల్లోని టీఆర్ ఎస్ ఇంచార్జ్‌ల స్థానంలో మార్ప‌లు త‌థ్యంగా క‌నిపిస్తున్నాయి.

అంటే ఎన్నో ఏళ్లుగా ఉద్య‌మంలో పాలుపంచుకుని, పార్టీకి సేవ‌చేసి.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారిని సీఎం కేసీఆర్ ప‌క్క‌న పెడ‌తార‌నే టాక్ న‌డుస్తోంది. అదేస‌య‌మంలో వివిధ పార్టీల్లో గెలిచిన వారిని ఇంచార్జ్‌లుగా నియ‌మిస్తార‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. దీంతో ఇప్పుడున్న ఇంచార్జ్‌లు తీవ్రంగా క‌ల‌వ‌రం వ్య‌క్తం చేస్తున్నారు. తాము పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ఇదేనా మ‌ర్యాద అని వారు అంటున్నారు. ఇక‌, అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం ఉన్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్లో ప‌నితీరు ఆధారంగా కొంద‌రిని తొల‌గిస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌ర‌గుతోంది. వీరికి వ‌చ్చే ఎన్నికల్లో సీట్లు ఉండ‌వ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.