నంద్యాల‌లో జ‌గ‌న్ గ‌ట్టి దెబ్బ త‌గ‌ల‌నుందా..!

తాము గెల‌వ‌లేమ‌ని తెలిసినా.. పోటీ ప్ర‌ధానంగా టీడీపీ,వైసీపీ మ‌ధ్య అని రాజ‌కీయ వ‌ర్గాల‌న్నీ కోడై కూస్తున్నా ఇవేమీ ప‌ట్టించుకోకుండా నంద్యాల ఉప ఎన్నిక బ‌రిలో కాంగ్రెస్ త‌మ అభ్య‌ర్థిని నిలబెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంతే గాక మైనారిటీ వ‌ర్గానికి చెందిన అబ్దుల్ ఖాదిర్‌ను త‌మ‌ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. ఏ న‌మ్మ‌కం మీద ఉప ఎన్నిక‌ బ‌రిలోకి దిగింది? మైనారిటీ అభ్య‌ర్థినే బ‌రిలోకి దించ‌డం వెనుక రాజ‌కీయంగా ఎవరికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అనే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది. అయితే కాంగ్రెస్ స్ట్రాట‌జీ క‌నుక వ‌ర్క‌వుట్ అయితే.. టీడీపీ కంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీకి ఎదురు దెబ్బేన‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

`టార్గెట్ వైసీపీ` ఇది అధికార టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ కాదు.. ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ తీసుకున్న‌ కీల‌క నిర్ణ‌యం! విభ‌జ‌న అనంత‌రం అన్ని వ‌ర్గాల‌ను దూరం చేసుకున్న ఆపార్టీ.. త‌మ ఓటు బ్యాంకును సంపాదించుకునే ప‌నిలో ప‌డింది. త‌మ ఓటు బ్యాంకు అంతా జ‌గ‌న్ కొల్ల‌గొట్టార‌ని కాంగ్రెస్ పెద్ద‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు. ఈ నేప‌థ్యం లోనే టీడీపీ కంటే వీలైనంతంగా జ‌గ‌న్‌ను టార్గెట్ చేయాల‌ని అధిష్టానం నుంచి ఆదేశాలు వ‌చ్చాయి. ఇప్పుడు జ‌గ‌న్‌ను దెబ్బ కొట్టేందుకు వేచిచూస్తున్న కాంగ్రెస్ నేత‌ల‌కు.. ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. నంద్యాల ఉప ఎన్నికను వీలైనంత‌గా స‌ద్వినియోగంచేసుకోవాల‌ని చూస్తున్నారు. అందుకే మైనారిటీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపారు.

ప్రధానంగా తలపడుతున్న పార్టీలు రెండూ రెడ్డి వర్గానికి చెందిన వారికే టికెట్ ఇచ్చాయి. కులాలు మతాల పరంగా నంద్యాలలో ముస్లిం ల ఓటు బ్యాంకు కూడా చాలా కీలకం. అయినా .. రెండు ప్రధాన పార్టీలు ముస్లింలను ఆకట్టుకోవ డానికి రకరకాల హామీలు ఇస్తున్నారే తప్ప.. టికెట్ ఇవ్వలేదు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థితో ముందుకు వచ్చింది. కాంగ్రెస్ కు ఎటూ విజయం దక్కదు గానీ.. కాంగ్రెస్ ముస్లింను రంగంలోకి తేవడం వల్ల‌ అంతో ఇంతో వైసీపీకే నష్టం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ముస్లిం వర్గానికి చెందిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కమలనాథులతో దోస్తీ క‌ట్టిన తెలుగుదేశానికి ఓటు వేసే పరిస్థితి ఉండదు.

అప్పుడు ముస్లింల ఓట్లు వైసీపీకే ప‌డ‌తాయి. ఇప్పుడు ముస్లిం అభ్యర్థిని తేవడంతో పాటూ.. వైసీపీ కూడా కమలనాథు లతో దోస్తీ కోసం పాకులాడుతోంద‌నే సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లేలా చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంది. ఇదే జ‌రిగితే వైసీపీకి అండ‌గా ఉంటున్న కొంద‌రు ముస్లింలు కాంగ్రెస్ కు ఓటు వేసే అవ‌కాశాలు లేక‌పోలేదు. అంటే వైసీపీకి పడాల్సిన ఓట్లు చీలిపోయినట్లే. మ‌రి ఓట్ల చీలిక టీడీపీకి లబ్ధి చేకూర్చే అంశ‌మే! మొత్తానికి కాంగ్రెస్ ప‌క్కా వ్యూహంతోనే బ‌రిలోకి దిగుతోందని చెబుతున్నారు విశ్లేష‌కులు.