టీటీడీ చైర్మ‌న్ కోసం టీడీపీలో నాలుగు స్తంభాలాట‌

ఏపీలో కీల‌క‌మైన నామినేటెడ్ పోస్టుల్లో టీటీడీ చైర్మ‌న్ పోస్టు ఒక‌టి. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ధ‌నిక దేవాల‌య‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ పోస్టుకు మ‌మూలు క్రేజ్ ఉండ‌దు. ఈ ధర్మకర్తల మండలికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. టీటీడీ చైర్మన్ పదవి కోసం తలపండిన రాజకీయ నేతల నుంచి ఎందరో పోటీ పడతారు. ఈ పోస్టుతో పాటు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లిలో స‌భ్య‌త్వం కోసం ఇత‌ర రాష్ట్రాల సీఎంలు, కేంద్ర‌మంత్రులు కూడా సిఫార్సులు కూడా వ‌స్తాయి.

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్న చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ప‌ద‌వీకాలం ఈ నెల 27తో ముగుస్తోంది. ఆ త‌ర్వాత కొత్త చైర్మ‌న్‌తో పాటు పాల‌క‌మండ‌లిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుత చైర్మ‌న్ చ‌ద‌ల‌వాడ‌పై అటు సీఎం చంద్ర‌బాబుతో పాటు టీటీడీ ఉద్యోగుల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెల‌కొని ఉంది. చ‌ద‌ల‌వాడ స‌తీమ‌ణి ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార పార్టీ అభ్య‌ర్థిగా పోటీగా స్వ‌తంత్య్రంగా నామినేష‌న్ వేసింది. ఇది చంద్ర‌బాబులో తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది.

ఇక చ‌ద‌ల‌వాడ స్థానికుడే అయినా ఆయ‌న ఉద్యోగులకు పెద్ద‌గా చేసిందేమి లేద‌ని వారు అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయ‌న త‌న‌కు మ‌రో రెండేళ్ల పాటు చైర్మ‌న్ ప‌ద‌విని రెన్యువ‌ల్ చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నా ఆయ‌న‌కు ఆ ఛాన్స్ లేద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం టీడీపీలో ప్ర‌ధానంగా ఇద్ద‌రు సీనియ‌ర్ ఎంపీలు పోటీప‌డుతున్నారు.

టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తోన్న న‌ర‌సారావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావుతో పాటు రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్ త‌మ‌కంటే త‌మ‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి కావాల‌ని చంద్ర‌బాబును కోరుతున్నారు. అయితే నిన్న‌టి వ‌ర‌కు వీరి పేర్లే వినిపించినా ఇప్పుడు కొత్త‌గా మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్లు కూడా లైన్లోకి వ‌చ్చేశారు.

చిత్తూరు జిల్లాకే చెందిన గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు, బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌మ‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల్సిందేన‌ని చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ఒత్తిడి చేస్తున్నార‌ట‌. వీరిద్ద‌రు బాబుపై బెదిరింపు ధోర‌ణితోనే ఉన్నార‌ని కూడా స‌మాచారం. దీంతో ఫైన‌ల్‌గా చంద్ర‌బాబు ఎవ‌రికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తారో కాస్త స‌స్పెన్స్‌గానే ఉంది.