వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల‌కు కొత్త ట్విస్ట్‌

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ఏపీలో విప‌క్ష వైసీపీని తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. నంద్యాల ఫ‌లితం ఎఫెక్ట్‌తో ప‌లువురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ పేర్ల‌తో స‌హా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్ర‌చారంతో ఎలెర్ట్ అయిన వైసీపీ నాయ‌క‌త్వం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉందనేది ఆరా తీసుకున్నట్లు తెలుస్తోంది. గ‌త రెండు మూడు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నార‌ని వ‌స్తోన్న వార్త‌ల్లో మొత్తం 11 మంది ఎమ్మెల్యేల పేర్లు వినిపించినా వాళ్ల‌లో ప్ర‌ధానంగా శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్‌ సునీల్‌కుమార్ పేర్ల‌పైనే పార్టీలో ఎక్కువ చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

పార్టీ మార‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న ఎమ్మెల్యేల‌లో కొంద‌రు మీడియా ముందుకు వ‌చ్చి తాము పార్టీ మార‌డం లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అయితే తనపై తెలుగుదేశం పార్టీనే మైండ్‌ గేమ్‌ ఆడుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్రం మౌనంగా ఉండ‌డంతో ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మౌనంగా ఉన్న ఎమ్మెల్యేల‌తో పాటు అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేల‌ను బుజ్జ‌గించే బాధ్య‌త‌ల‌ను జ‌గ‌న్ విజ‌య‌సాయిరెడ్డితో పాటు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు అప్ప‌చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల‌కు ఏజ్ కటాఫ్ :

ఇదిలా ఉంటే 2019 ఎన్నిక‌ల్లో గెలుపు కోసం వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఓ స‌రికొత్త వ్యూహం అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు సీట్ల కేటాయింపులో వయసును పరిగణలోకి తీసుకోవాలని పీకే జ‌గ‌న్‌కు సూచించినట్లు పార్టీలో ప్రచారమవుతోంది. 50 సంవత్సరాలలోపు వారికి ఎమ్మెల్యే, ఆపైన వారికి ఎంపీ సీట్లు కేటాయించాలని, అది కూడా గెలిచే వారికే అని పీకే చెప్పాడ‌ట‌.

ఇక ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో 25 మంది వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌ర‌ని, వారికి టిక్కెట్లు ఇవ్వ‌వ‌ద్ద‌ని చెప్పిన పీకే వారి కోసం ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ముగ్గురు పేర్ల‌తో ప్ర‌త్యామ్నాయం కూడా సూచించిన‌ట్టు కూడా వైసీపీ వాళ్లే చెపుతున్నారు. ఈ మ్యాట‌ర్ లీక్ అవ్వ‌డంతో సీటు రాకపోవచ్చని భావిస్తున్న నేతలు పార్టీ మారదామనుకుంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా పీకే చెప్పినట్టు ఈ వ‌య‌స్సు క‌టాఫ్ నియ‌మం అనుకున్న రేంజ్‌లో స‌క్సెస్ కాద‌ని చాలామంది చెపుతున్నారు.