అశోక్ బాబుకు షాక్ ఇచ్చిన ఉద్యోగులు

February 6, 2017 at 9:54 am
40

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అండ‌గా నిలిచిన వారిలో ఉద్యోగ ఐకాస ప్ర‌ధాన‌మైన‌ది! ఎన్‌జీవోల సంఘం అధ్య‌క్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోని ఉద్యోగులు.. టీడీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. అంతేగాక ఉద్యోగ సంఘాల‌న్నింటినీ ఐక్యం చేయ‌డంలో అశోక్‌బాబు కృషి ఎన‌లేనిది. అయితే ఇప్పుడు ఆయ‌న‌పై ఉద్యోగులు అసంతృప్తి వెళ్ల‌గ‌క్కుతున్నారు! ముఖ్యంగా అశోక్‌బాబును టార్గెట్ చేస్తూ.. స‌రికొత్త సంఘానికి తెర తీశారు! ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఆయ‌న తీవ్రంగా విఫ‌ల‌మ‌య్యార‌ని ఆరోపించారు. అంతేగాక కొత్త‌గా ఏర్పాటైన జేఏసీనే అస‌లైన జేఏసీ అని ఉద్యోగ సంఘాలు స్ప‌ష్టంచేశాయి!

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఐక్య సంఘంలో చీలిక వచ్చింది.  ఏపీ ఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. ఆయ‌  తీరును నిరసిస్తూ 73 ఉద్యోగ సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఏపీ నూతన జేఏసీకి శ్రీకారం చుట్టాయి. 13 జిల్లాల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన అధ్యక్ష – కార్యదర్శులు – ఉద్యోగులు ఈ కార్య‌క్ర‌మానికి పెద్దఎత్తున తరలివచ్చారు. నూతన జేఏసీ ఆవిర్భావ సమావేశానికి వేల సంఖ్యలో ఉద్యోగులు, సంఘాల నేతలు – మహిళలు తరలిరావడంతో గ‌మ‌నార్హం!! ఉద్యోగ సంఘాల నూతన జేఏసీ చైర్మన్‌గా బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న.. అశోక్‌బాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా అశోక్ బాబు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నార‌ని వెంక‌టేశ్వ‌ర్లు విమ‌ర్శించారు. అశోక్‌బాబు ఏకపక్షంగా వ్యవహరించడంతోపాటు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించానికి సిద్ధంగా ఉన్నా సైంధవుడిలా అడ్డుపడి జేఏసీ లక్ష్యాన్నే భ్రష్టు పట్టించారని దుయ్య‌బ‌ట్టారు. సీఎం చంద్ర‌బాబు ఉద్యోగుల‌ సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేసినప్పటికీ అశోక్ బాబు ముందుకు సాగలేద‌న్నారు. ఈ స‌మ‌యంలో ఉద్యోగ సంఘాల నేత‌లు తన వద్దకు వచ్చి నూతన జేఏసీని ఏర్పాటుచేయాల‌ని కోరారని బొప్పరాజు తెలిపారు. అందుకే ఈ వేదిక ప్రారంభించామ‌ని వివరించారు. ఇక్కడ ఏర్పడిన జేఏసీ తలుపులు గడియపెట్టుకుని ఏర్పాటైంది కాదని బహిరంగంగా-స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకున్న జేఏసీ అన్నారు. ఇదే నిజమైన జేఏసీ అన్నారు.

ఉద్యోగ సంఘ నేతలను బెదిరించే ధోరణి విడనాడాలని ఆయన అశోక్ బాబుకు హితవు పలికారు. ప్రత్యేక హోదాపై ఉద్యమించేందుకు అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. ఇప్పుడు కూడా కేంద్రం రాష్ట్రానికి ఏమైతే హామీలిచ్చిందో వాటిని నెరవేర్చుకోవడానికి రాజకీయ పార్టీలు ఎంతో ప్రయత్నిస్తున్నాయని వారు విఫలమైతే ప్రజల కోసం పోరాడతామన్నారు. తాను ఎమ్మెల్సీ పదవి కోరానని అది కాదన్నందుకే నూతన జెఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు.

అశోక్ బాబుకు షాక్ ఇచ్చిన ఉద్యోగులు
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share