ఆర్ఎస్ఎస్ ఎంట్రీతో మారిన ముంబై పొలిటికల్ సీన్

February 27, 2017 at 9:56 am
126

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో పొలిటిక‌ల్ సీన్ మారుతోంది! మ‌ళ్లీ పాత రోజులు తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. బీజేపీ, శివ‌సేన‌లు క‌లిసి పాలించేందుకు రెడీ అవుతున్నాయి. ఇటీవ‌ల మూడు రోజుల కింద‌ట ముంబై మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు వెలువ‌డ్డాయి. ఈ ఫ‌లితాల్లో బీజేపీ స‌త్తా చాటినా.. శివ‌సేన కూడా బీజేపీకి గ‌ట్టి పోటీగానే నిలిచింది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల్లో దేనికీ మేయ‌ర్ పీఠం ద‌క్కించుకునేంత మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ పాతమిత్రులు కల‌వాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఇదే జ‌రిగితే.. శివసేన-బీజేపీ పార్టీలు మేయర్‌ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకుంటాయని ఆర్‌ఎస్‌ఎస్ నేత ఎంజీ వైద్య ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మరోవైపు శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీనే ముందుగా మేయర్‌ పదవి చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే, ఎంజీ వైద్య వ్యాఖ్యలపై రెండు పార్టీలు ఇప్పటివరకూ స్పందించలేదు. బీజేపీ, శివ‌సేన‌ల ప‌ట్ల ఇటీవ‌ల కొంత‌కాలంగా ఉప్పు నిప్పు మాదిరిగా ప‌రిస్థితి మారింది. అయితే, రాజ‌కీయాల్లో ఎవ‌రూ శాశ్వ‌త శ‌తృవులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌బోర‌నేది నిజం. ఇదే ఫార్ములా ఇప్పుడు బీజేపీ, శివ‌సేన‌ల‌కు అప్లై కాబోతోంద‌ట‌!

మ‌రోప‌క్క‌, ఏ పార్టీకీ మెజార్టీ రాకపోయినప్పటికీ అధికారం ఏర్పాటు చేసేందుకు శివసేన-బీజేపీలకు సమాన అవకాశాలున్నాయి. దీంతో ఇరుపార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. మరోవైపు 31మంది కార్పొరేటర్లను గెలుచుకున్న కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకునేందుకు ఇటు బీజేపీ కానీ, శివసేనే కానీ సిద్ధంగా లేవు. అలాగే ఇండిపెండెంట్ల మద్దతు, గెలిచిన తిరుగుబాటుదారులు సొంతగూటికే చేరడంతో శివసేనకు 89మంది కార్పొరేటర్ల బలం ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఇండిపెండెంట్లతో పాటు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మేయర్‌ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఆర్ఎస్ఎస్ ఎంట్రీతో మారిన ముంబై పొలిటికల్ సీన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share