ఎమ్మెల్యేగానే లోకేష్ పోటీ..! నియోజకవర్గం ఇదే..?

February 7, 2017 at 9:12 am
510000

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాల‌ని టీటీడీపీ నేత‌లతో చంద్ర‌బాబు చెప్పిన నాటి నుంచి.. టీడీపీ శ్రేణుల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న్ను ఎమ్మెల్సీ కోటా నుంచి ఎన్నుకుంటార‌నే ప్ర‌చారం జోరందుకుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు పోటీగా లోకేష్‌ను భావిస్తున్న స‌మ‌యంలో.. ఎమ్మెల్సీగా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి వెళితే ప్ర‌తికూల సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి వెళ‌తాయ‌నేది ఇప్పుడు ప్ర‌ధాన అడ్డంకిగా మారింది. దీంతో ఇప్పుడు లోకేష్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాల‌ని నిర్ణ‌యించినట్టు స‌మాచారం! అంతేగాక నియోజ‌క‌వ‌ర్గం కూడా డిసైడ్ అయిపోయిన‌ట్లు తెలుస్తోంది.

తన తనయుడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలా? వద్దా? అన్నదానిపై అనేక‌ తర్జనభర్జనల అనంత‌రం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆరు నెలలలోపు శాసనమండలి లేదా శాసనసభకు కానీ ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్సీ చేస్తారని పార్టీలో చాలా మంది భావిస్తున్నారు. మ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారని సీనియర్‌ నేత తెలిపారు. అయితే యువకుడైన లోకేష్‌ను శాసనమండలికి ఎంపిక చేయడం బాగుండదని కొంద‌రు సీనియ‌ర్ల అభిప్రాయం!

ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేకనే ఆయనను శాసనమండలి ఎంపిక చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తాయ‌ని సీనియ‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు! ముఖ్యంగా జగన్‌కు పోటీ అని భావిస్తున్న లోకేష్‌ రాయల్‌గా ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లోకి అడుగుపెట్టాల్సి ఉందని వారు అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తే ఆయన ఇమేజ్‌ను పార్టీ దెబ్బతీసినట్లు అవుతుందని కూడా వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం లోకేష్ రాజ‌కీయ భవిష్యత్తుకు, పార్టీకి మంచిదని  సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తన తాతగారి జిల్లా అయిన కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి ఆయన పోటీ చేస్తే బాగుంటుందని మెజారిటీ నాయకులు కోరుతున్నారు. లోకేష్‌ పోటీ చేస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే! ఇక్క‌డ క‌మ్మ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ మంది ఉండడం, పార్టీ కూడా బలంగా ఉండడంతో లోకేష్ విజ‌యం నల్లేరుపై న‌డ‌కే అని స్ప‌ష్టం చేస్తున్నారు. కృష్ణా జిల్లా నేతల్లోని విభేదాల‌ను చ‌క్క‌దిద్దేందుకైనా ఇక్క‌డి నుంచే పోటీ చేయాల‌నే డిమాండ్ వినిపిస్తోంది. మ‌రి త‌న‌యుడి విష‌యంలో బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచిచూడాల్సిందే!!

ఎమ్మెల్యేగానే లోకేష్ పోటీ..! నియోజకవర్గం ఇదే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share