ఏపీని మరోసారి మోసం చేసిన కేంద్రం

February 2, 2017 at 9:47 am
18

విశాఖ రైల్వే జోన్‌! గ‌త కొన్నాళ్లుగా భారీగా వినిపిస్తున్న డిమాండ్ ఇది! ఉత్త‌రాంధ్ర జిల్లాల ప్ర‌జ‌లు ఎప్ప‌టి నుంచో దీనికోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో విశాఖ రైల్వే జోన్ ప్ర‌క‌టించాల‌ని రోడ్ల మీద‌కి వ‌చ్చి పెద్ద ఎత్తున ధ‌ర్నా కూడా చేశారు. అయితే, అదిగో ఇదిగో అంటూ ఊరించిన కేంద్రం మ‌రో సారి తాజా బ‌డ్జెట్‌లో మొండి చేయి చూపింది. దీని కోసం పోరాడుతున్నామ‌ని చెబుతూ వ‌స్తున్న సీఎం చంద్ర‌బాబు అండ్ కో కూడా ఇప్పుడు మౌనం వ‌హించేశారు. ఇప్ప‌టికే ఏపీకి రావాల్సిన ప్ర‌త్యేక హోదాపై రాష్ట్రం అట్టుడుగుతుంటే.. విశాఖ జోన్ విష‌యం ఇప్పుడు మ‌రింత అగ్గి రాజేసేలా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే..

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఆర్థికంగా ఉప‌యోగ‌ప‌డే విశాఖ రైల్వే జోన్‌.. డిమాండ్‌ దశాబ్దాలుగా ఉంది. ప్ర‌స్తుతం తూర్పు రైల్వేలో భాగంగా ఉన్న ఉత్తరాంధ్ర.. అభివృద్ధికి విశాఖ రైల్వేను జోన్‌గా ప్ర‌క‌టిస్తే.. బాగుంటుంద‌ని ఇక్క‌డి వారి డిమాండ్‌. ఈ క్ర‌మంలో పాల‌కుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఒత్తిడి కూడా తెస్తున్నారు. వాస్త‌వానికి ఏపీ విభజన చట్టంలో రైల్వేజోన్‌ అంశం ఉంది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో విభ‌జ‌న చ‌ట్టంలో ఏముంటే వాటిని పూర్తిగా అమ‌లు చేస్తామ‌ని ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దీంతో జోన్ ప్ర‌క‌టిస్తార‌ని గ‌త ఏడాది రైల్వే బ‌డ్జెట్ స‌మ‌యంలోనూ  తాజాగా నిన్న ప్ర‌క‌టించిన బ‌డ్జెట్‌పైనా ఇక్క‌డి వాళ్లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.

కానీ, కేంద్ర ప్ర‌భుత్వం అనూహ్యంగా అస‌లు విశాఖ జోన్ విష‌యాన్ని ప‌న్నెత్తు కూడా ప‌ట్టించుకోలేదు.  కానీ, ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం గ‌త ఏడాది తీవ్ర స్థాయిలో ఆందోళ‌న చేసిన స‌మ‌యంలోనూ ఇక్క‌డి వాళ్లు.. త‌మ‌కు జోన్ వ‌స్తే చాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ఎంపీ అవంతి శ్రీనివాస్ స‌హా కొంద‌రు రోడ్ల మీద‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌తో పాటు ఆందోళ‌న‌ల‌కు దిగారు. అప్ప‌ట్లో స్పందించిన సీఎం చంద్ర‌బాబు.. విశాఖ రైల్వే జోన్ చేసే బాధ్య‌త త‌న‌దిగా చెప్పుకొచ్చారు. ఇక‌, రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్ర‌భు కూడా ఏపీ నుంచే రాజ్య‌స‌భ‌కి ఎంపీగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఈ ద‌ఫా బ‌డ్జెట్‌లో గ్యారెంటీగా జోన్ వ‌స్తుంద‌ని ప్ర‌జ‌లు భావించారు. కానీ, కార‌ణాలు తెలీవుకానీ.. హోదా మాదిరిగానే విశాఖ జోన్ కూడా త‌యార‌య్యే ప‌రిస్థితి దాపురించింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోప‌క్క‌, నిన్న ప్ర‌క‌టించిన కేంద్ర బ‌డ్జెట్‌లో విశాఖ జోన్ విష‌యాన్ని ప్ర‌స్తావిచ‌క‌పోవడంపై ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగారు. వీరికి క‌మ్యూనిస్టు నేత‌లు మ‌ద్ద‌తు ప‌లికారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు మాట్ల‌డుతూ.. చంద్ర‌బాబును స‌హా కేంద్రాన్ని కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శించారు. త‌మ‌కు అన్యాయం చేస్తే స‌హించేది లేద‌ని అన్నారు. చంద్ర‌బాబు కేంద్రంతో లాలూచీ ప‌డుతున్నార‌ని కూడా ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళ‌న కారుల‌ను అరెస్టు చేసినా.. ఈ ఘ‌ట‌న మాత్రం విశాఖ జోన్ విష‌యంలో ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను వెల్ల‌డిస్తోంది. మ‌రి సీఎం చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి .

ఏపీని మరోసారి మోసం చేసిన కేంద్రం
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share