ఏపీలో సీన్ రివర్స్…వైసీపీలోకి జోరుగా వలసలు

February 15, 2017 at 12:57 pm
jagan121485172451

ఏపీ రాజ‌కీయాల్లో షాకింగ్ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల‌ను, నాయ‌కుల‌ను త‌న పార్టీలో చేర్చేసుకుంది. అయితే గ‌త కొద్ది రోజులుగా ఇత‌ర పార్టీల‌కు చెందిన సీనియ‌ర్లు, నాయ‌కులు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల వార‌సులు వ‌రుస‌గా జ‌గ‌న్ గూటికి చేరుతున్నారు. ఈ క్ర‌మంలోనే నిన్న తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొప్ప‌న మోహ‌న్‌రావు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు.

ఇక ఇప్పుడు వంతు క‌ర్నూలు జిల్లాకు వ‌చ్చింది. క‌ర్నూలు జిల్లాలో అధికార టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుల్లో ఒక‌రు, ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ ఇన్‌చార్జ్ గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. వైఎస్ జగన్ కండువా కప్పి గంగులను పార్టీలోకి ఆహ్వానించారు.

క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో గంగుల కుటుంబానికి బ‌ల‌మైన ప్రాబ‌ల్యం ఉంది. 2014 ఎన్నిక‌లకు ముందుగా ఆయ‌న కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత భూమా నాగిరెడ్డి, ఆయ‌న కుమార్తె భూమా అఖిల‌ప్రియ టీడీపీలో చేర‌డంతో గంగుల‌కు చంద్ర‌బాబు వ‌ద్ద, టీడీపీలో ప్ర‌యారిటీ త‌గ్గిపోయింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తన అనుచ‌రుల‌తో వైసీపీలోకి జంప్ చేసేశారు.

గంగుల‌తో పాటు ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్దరు జడ్పీటీసీలు, ఎంపీపీలు, 35మంది ఎంపీటీసీలు,37 మంది సర్పంచులు వైసీపీలో చేరనున్నారు. కాగా గంగులకు త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని జగన్ చెప్పడంతో ఆయన పార్టీలో చేరినట్లు సమాచారం.  ఇక ఇత‌ర పార్టీల నుంచి వైసీపీలోకి ప‌లువురు సీనియ‌ర్లు వ‌స్తుండ‌డం జ‌గ‌న్‌లో ఫుల్ జోష్ నింపుతోంద‌న్న టాక్ వ‌స్తోంది.

ఏపీలో సీన్ రివర్స్…వైసీపీలోకి జోరుగా వలసలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share