ఓపీఎస్‌కు మ‌ద్దతు వెనుక బీజేపీ వ్యూహ‌మిదేనా

April 24, 2017 at 9:21 am
593

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో క‌ల‌గ‌జేసుకోబోమ‌ని ప్ర‌క‌టిస్తూనే.. రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో ఏర్ప‌డ్డ అనిశ్చితికి కారణం కాద‌ని చెబుతూనే.. గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌ను సృష్టిస్తోంది. రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన ఓపీఎస్‌, ఈపీఎస్ వర్గాల‌ను మ‌ళ్లీ ఒక్క‌టిగా క‌ల‌వ‌డం వెనుక కేంద్రం జోక్యం ఉంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అలాగే ప‌న్నీర్ సెల్వాన్ని తిరిగి సీఎం పీఠంపై నిలిపేందుకు కూడా మంత‌నాలు జ‌రుపుతోంది. దీని వెనుక పెద్ద మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌నే చ‌ర్చ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది.

త‌మిళ‌నాడులో విస్త‌రించేందుకు దక్కిన ఏ అవ‌కాశాన్నీ బీజేపీ నేతలు వ‌దులుకోవ‌డం లేదు. మాజీ సీఎం దివంగ‌త జ‌య‌లలిత మ‌ర‌ణం త‌ర్వాత‌.. రాజ‌కీయంగా ఏర్ప‌డిన శూన్య‌త‌ను కాషాయ జెండాతో ఫిల్ చేయాల‌ని బీజేపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. అనంత‌రం జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ జైలు పాలవ్వ‌డం, అనూహ్యంగా ప‌ళ‌నిస్వామి సీఎం అవడం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. తొలి నుంచి ప‌న్నీర్ సెల్వానికి అండ‌గా నిలిచిన బీజేపీ.. ఇప్పుడు కూడా ఆ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డే ఉంది. త‌మ‌కు త‌మిళ రాజ‌కీయాల‌తో సంబంధం లేద‌ని చెబుతున్నా.. దూరదృష్టితో పావులు కదుపుతున్నట్లు సమాచారం.

తమిళనాడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు దివంగత సీఎం జయలలితకు అత్యంత విధేయుడిగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై దృష్టి సారించిందనేది తాజా టాక్. ప్రస్తుత సమీకరణాల నేపథ్యంలో పన్నీర్ సెల్వం సీఎం పీఠం అదిరోహించేందుకు కేంద్రం పూర్తిగా మద్దతునిస్తుందనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం సెల్వం బలపడినందున ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు కొందరు ఆయన వైపు వస్తారని బీజేపీ అంచనా వేస్తోంది.

అనంతరం ఆయనకు బీజేపీ పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు చెప్తున్నారు. ఈ మిత్రత్వంతో 2019లో జరిగే లోక్‌స‌భ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాల్లో 15 స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ ఆశిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కొందరు నేతలను తీసుకుని విస్తరించాలని కమలనాథులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా పార్టీని విస్త‌రించాల‌ని బీజేపీ నేత‌లు వ్యూహాలు అమ‌లుచేస్తున్నార‌ట‌.

ఓపీఎస్‌కు మ‌ద్దతు వెనుక బీజేపీ వ్యూహ‌మిదేనా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share