కడప తమ్ముళ్లకు సీరియస్ వార్నింగ్ అందుకేనా

February 10, 2017 at 9:50 am
7400

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టాల‌ని ఏపీసీఎం చంద్ర‌బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటే వాటికి కార్య‌క‌ర్త‌లు తూట్లు పొడుస్తున్నారు! ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి.. నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. చంద్ర‌బాబు ముందు ఒక‌లా.. ఆయ‌న వెనుక మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తూ దాగుడు మూత‌లు ఆడుతున్నారు. ఎంత చెప్పినా క‌డ‌ప నాయ‌కుల తీరు మార‌క‌పోవ‌డంతో.. చంద్ర‌బాబు ఇక వారికి ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చారు. నిర్ల‌క్ష్యం వీడ‌క‌పోతే.. ఇక ఉపేక్షించేది లేద‌ని స్ప‌ష్టంచేశారు.

క‌డ‌ప జిల్లాపై సీఎం చంద్ర‌బాబు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ ప్ర‌త్యేక దృష్టిసారించారు. కుప్పంను సైతం పక్కనపెట్టి… పులివెందుల కోసం వందల కోట్లు వెచ్చించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా మిగులు జలాలను గండికోట ప్రాజెక్టుకు మళ్లించి తద్వారా పులివెందులకు నీళ్లు అందించారు. అంతేగాక ఈ జిల్లా అభివృద్ధికి కోట్ల నిధులు ఖ‌ర్చుపెడుతున్నారు. దీని ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జిల్లాలో టీడీపీని తిరుగులేని శ‌క్తిగా మార్చాల‌ని భావిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియ జెప్పాలని కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పార‌ట‌.

కానీ పెద్దల మాటలను ఖాతరు చేయకుండా గ్రూపు రాజ‌కీయాల్లో ప‌డి క‌ర్తవ్యాన్ని విస్మరిస్తున్నారట. దీనికి తోడు కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మూడు లేదా నాలుగు గ్రూపులు ఉన్నాయట. ఈ గ్రూపులు అనునిత్యం ఆధిపత్యం కోసం యుద్ధానికి దిగుతున్నాయట. కడప తెలుగు తమ్ముళ్ల  వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఇటీవల ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు కూడా అందాయట. దీంతో క‌డ‌ప త‌మ్ముళ్ల‌కు బాబు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చార‌ట‌. విజయవాడలో జ‌రిగిన‌ టీడీపీ సమావేశంలో కడప తెలుగు తమ్ముళ్లతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారట. పేరుపేరునా పిలిచి మరీ క్లాస్‌ తీసుకున్నారట.

`మీరు మారరా? మీలో మార్పు ఎప్పటికీ రాదా? మారకండి! ఇక మీ జిల్లాపై ఆశ వదులుకోవాలని అనుకుంటున్నా! మీరు అడిగినవన్నీ ఇచ్చా. కానీ మీరు ఏమి చేస్తున్నారూ? కడపలో పార్టీని బలోపేతం చేయమంటే.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. పులివెందులకు నీళ్లు మనం ఇస్తే… కొన్నిచోట్ల వైసీపీ నేతలు గేట్లు ఎత్తి ప్రారంభించే పరిస్థితి తెచ్చారు. మీరేం చేస్తున్నట్టు? ఇదే మీకు చివరి హెచ్చరిక. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకు వస్తేనే నా దగ్గరకు రండి. లేదంటే కనిపించకండి` అంటూ సీరియస్‌ అయ్యారట.మ‌రి ఇప్ప‌టికైనా త‌మ్ముళ్ల వైఖ‌రిలో మార్పు వ‌స్తుందేమో వేచిచూడాలి!!

కడప తమ్ముళ్లకు సీరియస్ వార్నింగ్ అందుకేనా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share